ఏటికొప్పాక అభివృద్ధికి అడుగులు.. పర్యాటక గ్రామం కోసం స్థల పరిశీలన..
12/August/2026 21:13
Share:
అనకాపల్లి జిల్లా, ఆగస్టు 12 (క్రైమ్ న్యూస్ రిపోర్టర్ ఆనంద్): యలమంచిలి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. బుధవారం యలమంచిలి జడ్పీ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఏటికొప్పాక లక్కబొమ్మలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంతో పాటు కళాకారులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అంకుడు కర్రల కొరత లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏటికొప్పాకను ప్రత్యేక పర్యాటక గ్రామంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసిందని, మొత్తం రూ.6 నుంచి రూ.7 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, IASతో కలిసి ఏటికొప్పాక గ్రామంలో పర్యాటక అభివృద్ధికి అవసరమైన స్థలాలను పరిశీలించి, భూసేకరణకు అనువైన ప్రాంతాలపై కసరత్తు చేసినట్లు పేర్కొన్నారు. పర్యాటక గ్రామంలో షాపింగ్ ప్రాంగణాలు, భోజనశాలలు, లక్కబొమ్మల తయారీపై శిక్షణకు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పోలవరం కాలువ జలాశయం సమీప ప్రాంతాన్ని కూడా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. భూ ఆక్రమణల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.సమావేశంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.