అనకాపల్లి, ఆగస్టు 10: రైల్వే అండర్‌పాస్ ద్వారా ప్రయాణించిన రెండు భారీ లారీలకు చెరో రూ.20,035 చొప్పున మొత్తం రూ.40,070 జరిమానా విధించినట్లు అనకాపల్లి ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
అనకాపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం. వెంకట నారాయణ పర్యవేక్షణలో అనకాపల్లి పట్టణ పరిధిలో భారీ వాహనాల రాకపోకలకు 24/7 నిషేధం అమలులో ఉన్న రైల్వే అండర్‌పాస్ లోకి నిబంధనలను ఉల్లంఘించి ప్రవేశించిన రెండు భారీ లోడ్ లారీలపై పోలీసులు చర్యలు చేపట్టారు. వాటిపై మోటార్ వెహికల్ చట్టం కింద మొత్తం రూ.40,070 జరిమానా విధించారు.భారీ వాహనాలు నిషేధిత రైల్వే అండర్‌పాస్ గుండా రాకపోకలు సాగించడం వల్ల రైల్వే వంతెన/అండర్‌పాస్ నిర్మాణానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నందున ఈ మార్గంలో భారీ వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించినట్లు పోలీసులు తెలిపారు.ఈ సందర్భంగా సంబంధిత లారీ డ్రైవర్లకు నిషేధిత మార్గంలో ఇకపై వాహనాలను నడపరాదని పోలీసులు తెలియజేశారు. నిబంధనలను పునరావృతంగా ఉల్లంఘించిన పక్షంలో చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు. భారీ వాహనాల చోదకులు నిబంధనలను పాటించాలని, ప్రమాదాలను నివారించేందుకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.