కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు.
జూట్ మిల్లు కార్మికుల నిరుద్యోగ భృతిని విడుదల చేయండి.. పార్లమెంట్ లో ఎంపీ పుట్టా మహేష్ కుమార్.
.. ఏలూరులో శ్రీ కృష్ణ జూట్ మిల్లు కార్మికుల సమస్యను పార్లమెంట్ లో ప్రస్తావించిన ఎంపీ.
.. దాదాపు 4,000 మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి పడుతున్న దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తెచ్చిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్
.. ఈఎస్ఐ ప్రధాన కార్యాలయంలో పెండింగ్ లో ఉన్న క్లెయిమ్ లను పరిష్కరించాలని కోరిన ఎంపీ.
డిల్లీ/ఏలూరు, ఆగస్టు 05: ఏలూరులో శాశ్వతంగా మూసివేయబడిన శ్రీ కృష్ణ జూట్ మిల్లు మరియు కొత్తూరులోని కృష్ణ హెసియన్స్‌కు చెందిన సుమారు 4,000 మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి పడుతున్న దుస్థితిని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ బుధవారం లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. రూల్ 377 కింద ఈ సమస్యను సభలో ప్రస్తావించిన ఎంపీ , 1948 ఈఎస్ఐ చట్టంలోని "అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన" కింద కార్మికులు నిరుద్యోగ భృతికి అర్హులని స్పష్టం చేస్తూ, ఇప్పటివరకు కొత్తూరు మిల్లుకు చెందిన 200 మంది కార్మికులు మాత్రమే ఈ ప్రయోజనాన్ని పొందారనీ, మిగిలిన కేసులన్నీ పెండింగ్ లోనే ఉండిపోయాయని తెలిపారు
ఏలూరులోని శ్రీ కృష్ణ జూట్ మిల్లు 03.03.2022న పనిచేయడం ఆపివేసినప్పటికీ, కార్మికులను కొత్తూరు యూనిట్‌కు బదిలీ చేశారు, అది కూడా ఆ తర్వాత మూసివేయబడింది. 22.06.2023న తుది పరిష్కార ఒప్పందం కుదిరిన తర్వాత, కార్మికులు ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందువల్ల, దీనిని ఒక ప్రత్యేక కేసుగా పరిగణించి, అర్హత కోసం పరిష్కార ఒప్పంద తేదీని పరిగణనలోకి తీసుకుని, ప్రభావిత ఏలూరు కార్మికులకు నిరుద్యోగ భృతిని మరింత ఆలస్యం లేకుండా త్వరితగతిన విడుదల చేసేవిధంగా ఈఎస్ఐ అధికారులను ఆదేశించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు.