రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు – ప్రజల్లో విస్తృత అవగాహనతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మరింత ముమ్మరం సీఎస్ఆర్ నిధులతో 8 బ్రీత్ అనలైజర్‌లను అందజేసిన ఫార్మజెల్ కంపెనీ ప్రతినిధులకు జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ అభినందనలు
అనకాపల్లి, ఆగస్టు 4: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ మరింత సమర్థవంతమైన చర్యలు చేపడుతోంది. నేషనల్ హైవే-16 అనకాపల్లి జిల్లా పరిధిలో అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ATMS) ద్వారా నమోదైన వీడియోల్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు అధికంగా గుర్తించబడిన నేపథ్యంలో, జిల్లా వ్యాప్తంగా కఠిన అమలు చర్యలతో పాటు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా ఐఎస్ఐ ప్రమాణాలు కలిగిన హెల్మెట్‌ను రైడర్, పిలియన్ రైడర్ ఇద్దరూ ధరించాలని, ట్రిపుల్ రైడింగ్, అతివేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ప్రమాదకర ఓవర్‌టేకింగ్, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి ఉల్లంఘనలకు దూరంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై మోటారు వాహనాల చట్టం ప్రకారం ఎటువంటి మినహాయింపు లేకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారులు, ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలు, విద్యాసంస్థలు, మార్కెట్లు, గ్రామాలు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, తనిఖీలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి తోడ్పాటుగా పరవాడలోని ఫార్మజెల్ కంపెనీ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల ద్వారా 8 బ్రీత్ అనలైజర్‌లను అనకాపల్లి జిల్లా పోలీసు శాఖకు అందజేసింది. ఈ బ్రీత్ అనలైజర్‌ల ద్వారా జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలను మరింత విస్తృతంగా నిర్వహించి, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ తెలిపారు. ఈ సందర్భంగా సామాజిక బాధ్యతతో పోలీసు శాఖకు సహకరించిన ఫార్మజెల్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఎస్.అప్పారావు, హెచ్‌ఆర్ శ్రీ కె.వి.ఎస్.రవికృష్ణ మరియు ఇతర కంపెనీ ప్రతినిధులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. "రోడ్డు భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా మీ ప్రాణాలను, ఇతరుల ప్రాణాలను కాపాడవచ్చు. మద్యం సేవించి వాహనం నడపవద్దు – సురక్షిత ప్రయాణమే ఉత్తమ ప్రయాణం" అని జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహనరావు, అనకాపల్లి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎం.వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.