అనకాపల్లి జిల్లా, ఆగస్టు 2
ఎలమంచిలి మండలం మేజర్ పంచాయతీ ఏటికొప్పాక గ్రామానికి చెందిన జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీత హస్తకళాకారుడు లక్కోజు నాగేశ్వరరావు రూపొందించిన ఏటికొప్పాక సంప్రదాయ కళారూపాల డెమో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ముఖద్వారంలో ఏర్పాటు చేయబడింది. ఈ కళాఖండం ఏటికొప్పాక హస్తకళల వైభవాన్ని ప్రతిబింబిస్తూ దేశ, విదేశాల నుంచి వచ్చే సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.ఈ సందర్భంగా లక్కోజు నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రభుత్వం ఏటికొప్పాక గ్రామాన్ని ప్రత్యేక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే హస్తకళాకారులకు మరింత ఉపాధి లభించడంతో పాటు గ్రామానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు వస్తుందని అన్నారు. హస్తకళల పరిరక్షణకు యువత ముందుకు రావాలని ఆయన కోరారు.స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు అన్నం బాబ్జి, తోటి కళాకారులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు లక్కోజు నాగేశ్వరరావును అభినందిస్తూ, ఆయన రూపొందించిన కళాఖండం ఏటికొప్పాక హస్తకళల ప్రతిష్ఠను మరింత పెంచిందని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకుని ఏటికొప్పాకకు మరింత ఖ్యాతి తీసుకురావాలని ఆకాంక్షించారు.
(క్రైమ్ న్యూస్ రిపోర్టర్ ఆనంద్)