గర్భిణీలకు పోషకారలోపం లేకుండా మెగా ఫీడ్ నిర్వహించాలి,వైద్య శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశం
30/July/2026 19:16
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు, :
ఏలూరు జిల్లాలో మాతా ,శిశు మరణాలపై సమగ్ర విచారణ చేసి, డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా మరణాలు సంభవించాయని తేలితే సంబంధిత వైద్యాధికారులపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్ లో బుధవారం ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యసేవలు, మాతా,శిశు మరణాలు నివారణ, సీజనల్ వ్యాధులు నియంత్రణ, తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ఏప్రిల్ నుండి జూన్ వరకు 5 మాతృ మరణాలు, 41 శిశుమరణాలు సంభవించాయని, ప్రతీ మాతా, శిశు మరణాలు తప్పనిసరిగా డెత్ ఆడిట్ జరగాలన్నారు. వీటిపై సమగ్ర విచారణ చేసి డాకర్లు, సిబ్బంది వైద్య సేవా లోపం కారణంగా మరణాలు సంభవించాయని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మాతా, శిశు మరణాలు నియంత్రించేందుకు గర్భిణీలకు గర్భం దాల్చిన దగ్గర నుండి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించాలని, అంగన్వాడీ, ఏఎన్ఎం., ఆశా వర్కర్లు గర్భిణీలు, పుట్టిన పిల్లల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. పౌష్టికాహారలోపం, రక్తహీనత వంటివి గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. హై రిస్క్ ప్రెగ్నన్సీ కలిగిన మహిళల విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. గర్భిణీలకు పోషకారలోపం లేకుండా మెగా ఫీడ్ నిర్వహించాలి జిల్లాలో ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో గర్భిణీలు సరైన పోషకాహారం లేని కారణంగా రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కుంటున్నారని, అటువంటి సమస్యలను అధికమించేందుకు జిల్లాలోని ఆంగవాడి కేంద్రాలలో 3 నెలలపాటు వారంలో రెండు లేదా 3 రోజులు పౌష్టికాహారం అందించేలా మెగా ఫీడ్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఐసిడిఎస్., వైద్య శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణపై చర్యలు జిల్లాలో మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, కోవిడ్ వంటి వ్యాధులు ప్రబలకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో ప్రజలు జ్వరం వస్తే ఆర్ఎంపి లను ఆశ్రయిస్తారని, వారి చికిత్సతో ఒక్కోసారి ప్రాణాంతకమవుతుందన్నారు. ఆరోగ్య కేంద్రం పరిధిలో అటువంటివి గుర్తిస్తే వెంటనే జిల్లా అధికారులకు తెలియజేయాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. విష జ్వరాలు ప్రబలకుండా ఫాగ్గింగ్ చేయించాలని, ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో విష జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యలపై వైద్యాధికారులు వారి పరిధిలోని ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆసుపత్రుల సేవలలో ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాలి ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై ప్రజల సంతృప్తి స్థాయిని మరింత పెంచేలా ప్రజలకు వైద్యాధికారులు మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. ఈ సందర్భంగా ముదినేపల్లి మండలం దేవపూడి ఆరోగ్యకేంద్రంలో వైద్య సేవలకు గాను 90 శాతానికిపైగా ప్రజల సంతృప్తి స్థాయి సాధించడంపై కలెక్టర్ సంబంధిత వైద్య సిబ్బందిని అభినందించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. శోభ, డిసిహెచ్ఎస్ బేబీ కమల, ఐసిడిఎస్ పిడి శారద, బాలల సంరక్షణాధికారి సిహెచ్. సూర్యచక్రవేణి, జిల్లాలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ప్రభృతులు పాల్గొన్నారు.