మాదకద్రవ్య రహిత ఏలూరు జిల్లాగా తీర్చిదిద్దే బాధ్యత మనందరిపై ఉంది
29/July/2026 19:49
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు.
ఉద్యోగాలకు, పాస్పోర్టులకు అనర్హత, శాశ్వత క్రిమినల్ రికార్డు, భవిష్యత్తు అంధకార మయం. నేషనల్ డెడికేషన్ హెల్ప్ లైను నెంబరు 14446, ఈగల్ టోల్ ఫ్రీ నెంబరు 1972 సద్వినియోగం చేసుకోవాలి. యువత మాదకద్రవ్యాల జోలికి పోవద్దు, మాదక ద్రవ్యాలు నిరోధక కమిటీ జిల్లా కలెక్టరు అధ్యక్షతన కె.వెట్రిసెల్వి సమావేశం నిర్వహించారు.జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ పాల్గొన్నారు
ఏలూరు, జూలై 29: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయీ మాదక ద్రవ్యాలు నిరోధక కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ మాదకద్రవ్య రహిత ఏలూరు జిల్లాను రూపొందించేందుకు సమాజంలోని ప్రతిఒక్కరూ కృషిచెయ్యాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలు జోలికి వెళ్ళితే భవిష్యత్తు అంధకారం అవుతుందని, యువతకు అవగాహన సదస్సులు విస్తృతంగా నిర్వహించాలని అన్నారు. డి-అడిక్షనుసెంటర్లలో పేషెంట్లకు అందిస్తున్న చికిత్సా విధానంపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. త్వరలో ఒక రోజు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి, డి-అడిక్షన్ సెంటర్లు పనితీరు, చికిత్సా సేవలు మరియు రోగులకు అందుతున్న సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తామని తెలిపారు. విద్యాశాఖ పరిధిలోని ప్రతి పాఠశాలకు ఒక నోడల్ అధికారిని నియమించాలని ఆదేశించారు. ఆయా నోడల్ అధికారి మాదకద్రవ్యాలు దుష్పరిణామాలు, హెల్ప్‌లైను నెంబర్లు, విద్యార్థులకు అవగాహన కల్పించే విధానంపై ప్రత్యేక శిక్షణ అందించి, వారి ద్వారా ప్రతి పాఠశాలలో క్రమం తప్పకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా విద్యాశాఖ అధికారులకు సూచించారు.ప్రతి పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులతో కూడిన ప్రత్యేక యాంటీ-డ్రగ్స్ అవగాహన బృందం ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ బృందం విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు, చట్ట పరమైన అంశాలు మరియు నివారణ చర్యలపై నిరంతరం అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ నషాముక్త్ భారత్ అభియాన్ బృందం ద్వారా అందించిన 1,000 గంజాయి డిటెక్షన్ కిట్లను జిల్లా కలెక్టరు చేతులు మీదుగా టీమ్ కి అందించామని తెలిపారు. వాటిని జిల్లా పోలీసు శాఖలోని సంబంధిత యూనిట్లకు పంపిణీ చేయడం జరుగుతుందని, గంజాయి రహిత ఏలూరు నిర్మాణంలో భాగంగా ప్రతి ప్రభుత్వ శాఖ తమ వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని అన్నారు. ప్రజల్లో మాదకద్రవ్యాలుపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తామని, అలాగే ఈగల్ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్లు – 1972కు సంబంధించిన స్టిక్కర్లను ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు మరియు ఇతర ప్రజా ప్రదేశాల్లో విస్తృతంగా ప్రదర్శించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. పాఠశాలల్లో డ్రగ్స్ వ్యతిరేక సందేశాలతో డ్రాయింగులు, వాల్ పెయింటింగులు మరియు ఇతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించామని తెలిపారు.ఈ సమావేశంలో ఉప రవాణా కమీషనరు యస్.కె.కరీం, జిల్లా రోడ్లు&భవనాలు శాఖ యస్ఇ కె.విజయరత్నం, ఏలూరు నగర పాలక సంస్థ కమీషనరు ఏ.భాను ప్రతాఫ్, జిల్లా పంచాయతీ శాఖ అధికారి జి.వి. మల్లిఖార్జున రావు, డిఆర్డిఏ పిడి టి.వి. విజయలక్ష్మి, జిల్లా బాలల సంరక్షణ అధికారి సి.హెచ్.సూర్య చక్రవేణి, జిల్లా ట్రాన్స్ పోర్టు అధికారి యస్.బి. శేఖరు, విభిన్న ప్రతిభా వంతులు శాఖ సహాయ సంచాలకులు బి.రామకుమార్, ఈగిల్ టీమ్ ఇంచార్చి బి.ఉదయ భాస్కర్, పోలీసు అధికారులు, సంబంధిత శాఖలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.