మాజీ సైనికుల సంక్షేమం కోసం సైనిక్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు. హోం మంత్రి అనిత విజయవాడలో సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో 'వెటరన్స్ డే' వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోం మంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరై సైనిక వీరులకు గౌరవ వందనం స్వీకరించారు. హోం మంత్రి అనిత మాట్లాడుతూ, సైనిక వీరులకు గౌరవ వందనం స్వీకరించడం తనకు అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. యూనిఫార్మ్‌లో ఉన్న లేకపోయినా మాజీ సైనికులు సరిహద్దుల్లోనే కాకుండా సమాజంలోనూ, విపత్తుల సమయంలో అందిస్తున్న సేవలు అమోఘమని ప్రశంసించారు. దేశ నిర్మాణంలో వారి సహకారం అమూల్యమని పేర్కొన్నారు. దేశాన్ని కుటుంబం, కులం, మతం కంటే ఎక్కువగా ప్రేమించడం అంటే ఏమిటో మాజీ సైనికులు తమ సేవల ద్వారా దేశానికి చూపించారని అన్నారు. సైనికులతో సమానంగా త్యాగం చేస్తున్న వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మాజీ సైనికుల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు చేపడుతోందని వెల్లడించారు. ప్రత్యేకంగా సైనిక్ వెల్ఫేర్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి మాజీ సైనికుల సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. యువత కూడా మాజీ సైనికుల సేవలను ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణ, దేశభక్తి లక్షణాలను పెంపొందించుకోవాలని హోం మంత్రి పిలుపునిచ్చారు.