ఏలూరు జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం

ఏలూరు జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం

29/July/2026 19:46    Share:   

#జిల్లాలో రహదారి ప్రమాదాలు నివారించాలి
#ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి చర్యలుతీసుకోవాలి
#రహదారి ప్రమాదాలలో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదు
#హెల్మెట్, సీట్ బెల్ట్ ధారణ ఆవశ్యకత  రహదారి భద్రతా నియమాలపై విస్తృత అవగాహన కలిగించాలి

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,  ఏలూరు, 
జిల్లాలో అధికంగా ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్  ను గుర్తించి ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లో మంగళవారం జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధ్యక్షతన జరిగింది.  జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్ తో కలిసి ప్రమాదాల నివారణపై తీసుకోవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో గత సంవత్సరం 304 రోడ్డు ప్రమాదాలలో 149 మంది మరణించారని, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ప్రమాదాలు, మరణాలు తక్కువ అయినప్పటికీ, ఇది ఆందోళన కలిగించే విషయమన్నారు.   అతివేగం, నియమాలు పాటించని  కారణంగా ప్రమాదాలు సంభవిస్తున్నాయని,  హెల్మెట్, సీట్ బెల్ట్  ధరించని కారణంగా మరణాలు సంభవిస్తున్నాయన్నారు.   రహదారి ప్రమాదాల కారణంగా ఎవరూ మరణించకుండా రహదారి భద్రతా నియమాలపై విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.  జాతీయ రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా సంభవించే ప్రాంతాలను, అందుకుగల కారణాలను  గుర్తించి ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు.  రహదారి భద్రతా కమిటీ సమావేశాలకు విజయవాడ రీజియన్ చెందిన జాతీయ రహదారుల సంస్థ అధికారులు హాజరుకాకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారులపై   ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తాయని, ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, వాటి నివారణకు చర్యలు తీసుకోవలసిన బాధ్యత జాతీయ రహదారుల సంస్థ అధికారులపై ఉందన్నారు. ఇంత ముఖ్యమైన సమావేశానికి జాతీయ రహదారుల సంస్థ అధికారులు హాజరుకాకపోవడం నిర్లక్ష్యమేనని, వారిపై చర్యలకు ప్రభుత్వానికి లేఖ రాస్తానని హెచ్చరించారు.
జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని  పాఠశాల బస్సులలో తప్పనిసరిగా డాష్ కెమెరాలు అమర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.  జాతీయ రహదారిపై అతివేగంతో వెళ్లే వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేయాలన్నారు. జాతీయ రహదారిపై వాహనాలు నిలుపుదల చేయకుండా చూడాలన్నారు. వాహనాలకు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు పెద్ద కాంతులు వెదజల్లే లైట్లు ఏర్పాటుచేయడం నిబంధనలకు విరుద్ధమని, అటువంటి వాహనదారులపై కేసులు నమోదు చేయడంతోపాటు, అటువంటి లైట్లు అమ్మే దుకాణాలపై కేసులు నమోదు చేయాలన్నారు.
ఈ సందర్భంగా గత సమావేశంలో  లేవనెత్తిన అంశాలపై తీసుకున్న చర్యలను రవాణా శాఖ ఉప కమీషనర్ కరీం తెలియజేసారు.
ఈ సమావేశంలో  డిఎస్పి శ్రావణ్ కుమార్, ఆర్టీవో యస్.బి.శేఖరు, డిపిఓ మల్లికార్జునరావు, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ . భానుప్రతాప్, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ ఎస్ఈ లు విజయరత్నం, జెడ్. రమేష్, డిఆర్డిఏ పిడి విజయలక్ష్మి,  సంబంధిత శాఖలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter