
అచ్చుతాపురం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా కార్మికులు తీవ్ర గాయాలపాలయ్యారు. నిన్న బి షిఫ్ట్ విధులు ముగించుకొని మోసయ్యపేట, కొత్త మోసయ్యపేట, చోడపల్లి గ్రామాలకు చెందిన మహిళా కార్మికులు ప్రయాణిస్తున్న టాటా ఎస్ వాహనం చెట్టుకు ఢీకొనడంతో 13 మంది గాయపడ్డారు.సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్. రాము, కన్వీనర్ కే. సోమునాయుడు ఈరోజు అచ్చుతాపురం ప్రైవేట్ ఆసుపత్రిలో గాయపడిన కార్మికులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గాయపడిన వారిలో సంధ్య కిమ్స్ హాస్పిటల్‌లో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుండగా, శెట్టి పాప, గంజి చౌడమ్మ, కిల్లాడి చంటి, ముచ్చు రామలక్ష్మి, కర్రీ వరలక్ష్మి, తోళ్ల సింహాద్రి, కిల్లాడి రాజేశ్వరి, కొండపల్లి చౌడమ్మ, శెట్టి లక్ష్మి తదితరులు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.వీరికి మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, కోలుకునేంతవరకు పరిశ్రమ యాజమాన్యం వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని సిఐటియు డిమాండ్ చేసింది.