వాతావరణ ఆధారిత పంటల భీమాపై రైతులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశం..
23/July/2026 15:40
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు, వాతావరణ ఆధారిత పంటల భీమా పథకంపై రైతులకు అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి బుధవారం పునర్వ్యవస్థీకరించబడిన వాతావరణ ఆధారిత పంటల భీమా పథకం అమలుపై అధికారులతో కలెక్టర్ వెట్రిసెల్వి టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ వాతావరణంలో వచ్చే ప్రతికూల మార్పుల కారణంగా కలిగే పంట నష్టం బారి నుండి నుండి రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునర్వ్యవస్థీకరించబడిన వాతావరణ ఆధారిత పంటల భీమా పథకంను అమలు చేస్తున్నాయన్నారు. పత్తి పంటకు ఎకరానికి 1900 రూపాయలు, నిమ్మ పంటకు 2500 రూపాయలు చొప్పున జూలై , 31 వతేదీ లోగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందన్నారు. అకాల, అధిక వర్షపాతం, చీడపీడల వాతావరణం, అధిక ఉష్ణోగ్రత, గాలివేగం, గాలిలో తేమశాతం, తదితర కారణాలతో జిల్లాలో పత్తి , నిమ్మ పంటలకు వాతావరణ ఆధారిత పంటల భీమా పథకం వర్తిస్తుందని, పత్తి పంటకు ఎకరానికి 38 వేలు, నిమ్మ పంటకు 50 వేల రూపాయలు చొప్పున పరిహారం అందించడం జరుగుతుందన్నారు. వ్యవసాయ భూమి కలిగిన రైతులు, కౌలుదారులు ఈ పధకానికి అర్హులని, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, భూమి పాస్ బుక్ నకళ్ళు, పంటవేసినట్లు ధృవీకరించిన ధ్రువీకరణ పత్రం లేదా స్వీయ ధ్రువీకరణ ఆధార్ అనుసంధానమైన బ్యాంకు ఖాతా, భూ వివరాలు మరియు ఇతర అవసరమైన పత్రాలతో సమీప కామన్ సర్వీస్/ పంటల భీమా పోర్టల్ లో ఆన్లైన్ ద్వారా/ పంటల భీమా యాప్/ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ ప్రతినిధి ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన రైతులకు బ్యాంకు ద్వారా భీమాలో నమోదవుతారని, బ్యాంకుల నుండి రుణాలు పొందని రైతులందరినీ వాతావరణ ఆధారిత పంటల భీమాలో నమోదయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో 577 మంది, వాతావరణ ఆధారిత పంటల భీమా లో కేవలం అతి తక్కువ 29 మంది రైతులు నమోదు కావడంపై అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, జిల్లాలోని అర్హులైన రైతులందరూ పంటల భీమా పధకంలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా, ఉద్యానవన అధికారి షాజా నాయక్, వ్యవసాయ, అనుబంధ రంగాల శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.