యలమంచిలి:
స్థానిక తులసి నగర్‌లో నిత్యం వందలాది మంది పాఠశాల విద్యార్థులు, సామాన్య ప్రజలు, ప్రయాణించే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. స్వల్ప వర్షానికే నీరు వెళ్లే మార్గం లేక ఈ రోడ్డు చెరువును తలపిస్తోంది. మురుగునీరు, వర్షపు నీరు రోడ్డుపైనే నిలిచిపోతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జారిపడుతున్న విద్యార్థులు, ప్రజలు:
రోడ్డుపై నీరు నిలిచి బురదమయంగా మారడంతో నడిచేందుకు వీల్లేని పరిస్థితి ఏర్పడింది. ద్విచక్ర వాహనదారులు, పాఠశాలలకు వెళ్లే చిన్నారి విద్యార్థులు, వృద్ధులు ఇక్కడ జారిపడి గాయాలపాలవుతున్నారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కమిటీలకు ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం:
డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని గత కొన్ని సంవత్సరాలుగా మున్సిపాలిటీ అధికారుల చుట్టూ తిరుగుతున్నా "చేస్తాం.. చేస్తాం" అని కాలయాపన చేస్తున్నారే తప్ప ఆచరణలో పని శూన్యమని స్థానికులు మండిపడుతున్నారు. ఇటీవల స్థానిక శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయకుమార్ గారి 'ప్రజా సమస్యల వేదిక'లో కూడా దీనిపై అధికారికంగా ఫిర్యాదు నమోదు చేశారు. అయినా సరే క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పూ రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
త్వరలోనే పరిష్కరిస్తాం: మున్సిపల్ కమిషనర్
ఈ సమస్యపై మున్సిపల్ కమిషనర్ గారిని వివరణ కోరగా.. తులసి నగర్ ప్రధాన రహదారి సమస్య తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. నిధుల లభ్యత, సాంకేతిక కారణాల వల్ల కొంత ఆలస్యమైందని, త్వరలోనే డ్రైనేజీ పనులను చేపట్టి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించాలని తులసి నగర్ వాసులు డిమాండ్ చేస్తున్నారు.