దుర్వాసనతో దద్దరిల్లుతున్న ఏటికొప్పాక.. డ్రైనేజీ కాలువలే వ్యాధుల కేంద్రాలు!

దుర్వాసనతో దద్దరిల్లుతున్న ఏటికొప్పాక.. డ్రైనేజీ కాలువలే వ్యాధుల కేంద్రాలు!

21/July/2026 13:13    Share:   

అనకాపల్లి జిల్లా,క్రైమ్అనాలసిస్ న్యూస్ రిపోర్టర్ ఆనంద్
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఏటికొప్పాక గ్రామం నేడు డ్రైనేజీ కాలువల దుస్థితితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చేతివృత్తి కళలకు ప్రసిద్ధి చెందిన ఈ గ్రామానికి ప్రతిరోజూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి సందర్శకులు, వ్యాపారులు, ప్రజలు అధిక సంఖ్యలో వస్తుంటారు. గ్రామం గుండా వెళ్లే ప్రధాన రహదారి కూడా రద్దీగా ఉంటుంది.
అయితే గ్రామంలోని డ్రైనేజీ మురుగునీరు మొత్తం పులపర్తి వైపు వెళ్లే ప్రధాన కాలువలో చేరుతుండగా, కాలువ చెత్త, పూడికతో నిండిపోయి నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. దీంతో మురుగునీరు నిల్వ ఉండి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. కాలువ పక్కనే చెత్త వేయడం వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది.ఈ కాలువ సమీపంలో ఉన్న ఆర్టిజన్స్ కాలనీ ప్రజలు, ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులు ప్రతిరోజూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దోమలు, ఈగలు విపరీతంగా పెరగడంతో డెంగ్యూ, మలేరియా వంటి అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రసిద్ధ పర్యాటక, హస్తకళా గ్రామమైన ఏటికొప్పాకకు వచ్చే సందర్శకులపై కూడా ఈ పరిస్థితి ప్రతికూల ప్రభావం చూపుతోందని గ్రామస్థులు చెబుతున్నారు. గ్రామ ప్రతిష్ఠకు మచ్చ తెస్తున్న ఈ సమస్యపై పంచాయతీ అధికారులు, సంబంధిత ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి కాలువలను శుభ్రపరిచి, చెత్త తొలగించి, మురుగునీరు సాఫీగా వెళ్లేలా శాశ్వత చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Breaking News

Subscribe our Newsletter