శ్రీ గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్వర్యంలో ‘తల్లి పేరిట ఒక మొక్క’

శ్రీ గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్వర్యంలో ‘తల్లి పేరిట ఒక మొక్క’

16/July/2026 19:11    Share:   

ఎలమంచిలి స్థానిక శ్రీ గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) క్రీడా మైదానం గురువారం ఒక మంచి సంకల్పానికి వేదికైంది. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా సామాజిక కార్యకర్త కూరగాయల బుజ్జి ప్రత్యేక ఆధ్వర్యంలో ‘తల్లి పేరిట ఒక మొక్క’ (ఏక్ పెడ్ మా కే నామ్) అనే విశిష్ట కార్యక్రమాన్ని కళాశాల ఆవరణలో  నిర్వహించారు. పచ్చదనాన్ని పెంపొందించడం మరియు సమాజంలో పర్యావరణ స్పృహను చాటడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రేమ చంద్రశేఖర్ మరియు వైస్ ప్రిన్సిపల్  సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై అధ్యాపక సిబ్బంది మరియు విద్యార్థులతో కలిసి  మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ ప్రేమ. చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో గ్లోబల్ వార్మింగ్ విపరీతంగా పెరిగిపోతోందని, దీనిని అరికట్టడానికి పచ్చదనం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఖాళీ స్థల ఆవరణలో కనీసం ఒక్క మొక్కనైనా నాటి, దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. తల్లిపై ఉన్న గౌరవంతో నాటే ప్రతి మొక్క భవిష్యత్ తరాలకు ప్రాణవాయువును అందిస్తుందని, ప్రకృతిని కాపాడుకోవడం మరియు రాబోయే తరాలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించడం మనందరి ప్రాథమిక బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు. కార్యక్రమ నిర్వాహకులు కూరగాయల బుజ్జి మాట్లాడుతూ, పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలంటే విస్తృతంగా అడవుల పెంపకం, సామాజిక వనరక్షణ జరగాలన్నారు. విద్యార్థి దశ నుంచే ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల వారిలో సామాజిక బాధ్యత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం కళాశాల ఎన్.ఎస్.ఎస్ (NSS) కోఆర్డినేటర్లు డా. చిట్టిబాబు మరియు  డా.సుజాత మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని, ప్రతి విద్యార్థి పర్యావరణ సైనికుడిగా మారాలని కోరారు. ఈ ఆకుపచ్చని సంకల్పంలో భాగంగా కళాశాల క్రీడా ప్రాంగణంలో (ప్లే గ్రౌండ్)  మొక్కలను నాటారు. నాటిన ప్రతి మొక్కను దత్తత తీసుకుని, వాటి ఎదుగుదలను నిరంతరం పర్యావరణ కమిటీతో పాటు విద్యార్థులు పర్యవేక్షిస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ పచ్చదనం పండుగలో కామర్స్ విభాగ అధిపతి (HOD) డాక్టర్ శ్రీనివాసు, ఫిజిక్స్ విభాగ అధిపతి వెంకన్న, కెమిస్ట్రీ ఆచార్యులు, కళాశాల ఇతర అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది మరియు అత్యధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కళాశాల యాజమాన్యం మరియు పర్యావరణ ప్రేమికులు ఈ సత్సంకల్పాన్ని అభినందించారు.
Breaking News

Subscribe our Newsletter