ఏటికొప్పాకలో ప్రత్యేక నమోదు కార్యక్రమం ప్రారంభం..!
అనకాపల్లి జిల్లా,(క్రైమ్ న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
యలమంచిలి మండలం మేజర్ పంచాయతీ అయిన ఏటికొప్పాక గ్రామంలో విద్యార్థులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిరంతరంగా అందేలా ఆధార్ వివరాల నవీకరణ (అప్‌డేట్) కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు, మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) సూచనల మేరకు మండలంలోని ప్రతి పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
దీనిలో భాగంగా బుధవారం అక్షరా స్కూల్‌లో విద్యార్థుల ఆధార్ అప్‌డేట్ ప్రక్రియ నిర్వహించగా, గురువారం జడ్పీహెచ్ హైస్కూల్‌లో ఈ కార్యక్రమం కొనసాగనుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మ ఒడి సహా విద్యార్థుల సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా అందుకోవాలంటే ప్రతి విద్యార్థి ఆధార్ వివరాలు తప్పనిసరిగా నవీకరించుకోవాలని అధికారులు సూచించారు.
తల్లిదండ్రులు పిల్లల ఆధార్ కార్డులతో సంబంధిత పాఠశాలకు హాజరై అప్‌డేట్ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. ఎంఈఓ ఆదేశాల మేరకు ఏటికొప్పాక గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ నూకరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో అక్షరా స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, కిసాన్ మోర్చా అధ్యక్షుడు సన్నంశెట్టి శ్రీను, ఎంపీపీ పాఠశాల మాజీ చైర్మన్ మొల్లేటి ప్రసాద్, శంకర్ రాజు గారు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అధికారులు ప్రతి విద్యార్థి ఆధార్ అప్‌డేట్ చేయించుకోవడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని సకాలంలో పొందాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.