మిత్తల్ స్టీల్ ప్లాంట్‌తో లక్ష మందికి ఉపాధి: ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
26/March/2026 07:11
Share:
ఏలూరు, మార్చి 25.. అనకాపల్లి జిల్లా చందనాడ పంచాయతీ పరిధిలో ఏర్పాటవుతున్న మిత్తల్ స్టీల్ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఏలూరు ఎమ్మెల్యే, టిడిపి జిల్లా అధ్యక్షులు బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు పవర్ పేటలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిలో ఈ ఉక్కు కర్మాగారం నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు . దాదాపు 5465 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ స్టీల్ ప్లాంట్ మొదటి దశ నిర్మాణం 2030 నాటికి పూర్తవుతుందని ఆయన చెప్పారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో తీసుకుంటున్న చర్యలు ఫలితాలు ఇస్తున్నాయని బడేటి చంటి పేర్కొన్నారు. రాయితీలు, త్వరితగతిన అనుమతులు ఇవ్వడం ద్వారా పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. కూటమి ప్రభుత్వం పై నమ్మకానికి అనకాపల్లి సమీపంలో ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంటే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కృషికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏలూరు నగర టిడిపి అధ్యక్షులు చోడే వెంకటరత్నం పలువురు క్లస్టర్ ఇంచార్జీలు, డివిజన్ ఇంచార్జిలు తదితరులు పాల్గొన్నారు.