పట్టిసీమ గోదావరి జలాలకు జలహారతి ఇచ్చిన దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్.
12/July/2026 20:31
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు జానంపేట (పెదవేగి), రైతాంగం సస్యశ్యామలంగా, సుభిక్షంగా ఉండటమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని దెందులూరు శాసనసభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు స్పష్టం చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు విడుదలైన సందర్భంగా.. పెదవేగి మండలం జానంపేట వద్ద ఉన్న పోలవరం రైట్ మెన్ కెనాల్ ఆక్విడెక్ట్ వద్ద ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు కూటమి ముఖ్య నాయకులతో కలిసి గోదావరి తల్లికి పసుపు, కుంకుమలు సమర్పించి, కర్పూర నీరాజనాలతో ఘనంగా జలహారతి ఇచ్చారు. పంటలు సమృద్ధిగా పండి, రైతాంగం సుభిక్షంగా ఉండేలా దీవించాలని గోదావరి అమ్మను వేడుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం, ప్రపంచాన్ని వణికిస్తున్న ఎల్ నినో తీవ్ర ప్రభావం వల్ల నేడు దిగువ ప్రాంత రైతాంగం నారు పోస్తే బ్రతికించుకోవడానికి కూడా దేవుడు కరుణించనటువంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నామన్నారు. ఇలాంటి తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో సైతం ఈనాడు కృష్ణా డెల్టా బ్రతుకుతుందంటే దానికి కారణం ఆనాడు 2014లో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చారిత్రాత్మక పట్టిసీమ నిర్ణయం మరియు ఆయన ముందుచూపేనని కొనియాడారు. ఈ పదేళ్లుగా పట్టిసీమ ద్వారానే ఈ ప్రాంతం పండుతోందని, ఆ మహత్కార్యాన్ని రైతాంగమంతా బలంగా నమ్ముతోందని చెప్పారు. కృష్ణా డెల్టాకు చివరి ఆయకట్టు అయిన ఏలూరు రూరల్ మండలంలో కనీసం తాగడానికి కూడా సరైన నీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ ఈరోజు పట్టిసీమ ప్రాజెక్ట్ గనుక లేకపోయి ఉంటే, ఈ ప్రాంత ప్రజలు ఊళ్లు ఖాళీ చేసి వలస వెళ్లడం తప్ప మరో మార్గం లేకపోయేదన్నారు. ప్రస్తుత ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొని, రైతులకు, కౌలు రైతులకు సాగునీరు అందించి ధైర్యాన్ని కల్పించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు నిరంతరం చర్చిస్తూ సమీక్షిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి గారు సోమవారం మధ్యాహ్నం పోలవరం వస్తున్నారని, పెదవేగి మండలంలో సరైన వర్షపాతం లేక ఆయిల్ పామ్, కొబ్బరి తోటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని, ఈ విపత్కర అంశాన్ని నేరుగా సీఎం గారి దృష్టికి తీసుకువెళతామని స్పష్టం చేశారు. గత గొడ్డలి పార్టీ పాలకుల బూటకపు తీరును ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు తీవ్రస్థాయిలో నిలదీశారు. కొందరు బూటకపు మాటలతో తామేదో పేపర్లపై శాంక్షన్లు తెచ్చామని గొప్పలు చెప్పుకున్నారని, కానీ కనీసం ఒక ఇటుక రాయి వేయడం గానీ, పునాదులు తవ్వడం గానీ ఎక్కడైనా చేశారా అని నిలదీశారు. "నేను 2014-19 మధ్య కాలంలో తెచ్చిన మంజూరులనే తాము మళ్లీ తెచ్చామని అబద్ధాలు చెప్పారు. 'సిద్ధం' సభల్లో ఇక్కడే శంకుస్థాపనలు చేశామని ప్రగల్భాలు పలికారు. మరి ఈరోజు వాళ్ల బూటకపు వాక్కులు ఏమైపోయాయి? వాళ్ల క్యాట్ వాక్‌లు ఏమైపోయాయి?" అంటూ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఎద్దేవా చేశారు. తన ప్రస్తుత 2024-29 ఎమ్మెల్యే పీరియడ్‌లోనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో పెదవేగి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి తీరుతామని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు సగర్వంగా ప్రకటించారు. ఈ భూమి ఆకాశం ఉన్నంతవరకు పెదవేగి ప్రాంతానికి నీటి ఇబ్బంది లేకుండా, రైతాంగం వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా నీటితో సస్యశ్యామలం చేయడమే తన ధ్యేయమన్నారు. ప్రస్తుతం పెదవేగి, కూచింపూడి, న్యాయంపల్లి, రాట్నాలకుంట, రాయన్నపాలెం గ్రామాలు సగం నీరు ఉండి, సగం నీరు లేక ఇబ్బందులు పడుతున్నాయని, ఆయా గ్రామాల ప్రజల జీవితాల్లో నీటి లభ్యత ద్వారా వెలుగులు నింపడమే కూటమి ప్రభుత్వ ఆశయమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ఈ జలహారతి కార్యక్రమంలో దెందులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారపాటి రామ సీత, బిజెపి జిల్లా అధ్యక్షులు చౌటపల్లి విక్రమ్ కిషోర్, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు బొప్పన సుధా, జల వనరుల శాఖ అధికారులు, మండల పార్టీల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జిలు సహా పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..