అనకాపల్లి: రైతులు జీవ ఎరువులు మరియు నానో యూరియాను శాస్త్రీయ పద్ధతిలో వినియోగించడం ద్వారా పంటల దిగుబడులు పెంచడంతో పాటు సాగు వ్యయాన్ని తగ్గించుకోవచ్చని అనకాపల్లి జిల్లా వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు శ్రీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.
ఆత్మ (ATMA) ఆధ్వర్యంలో, జిల్లా వనరుల కేంద్రం (District Resource Centre), అనకాపల్లి నిర్వహణలో, కేవీకే కొండెంపూడి సహకారంతో జీవ ఎరువులు మరియు నానో యూరియాపై రైతులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ సుబ్రహ్మణ్యం జీవ ఎరువుల ప్రాముఖ్యత, సమతుల్య ఎరువుల వినియోగం, నేల ఆరోగ్య పరిరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు.
అనంతరం కేవీకే కొండెంపూడి కార్యక్రమ సమన్వయకర్త డా. ఎన్. రాజా కుమార్ వ్యవసాయ పంటల్లో జీవ ఎరువుల వినియోగం, వాటి ప్రయోజనాలు, నానో యూరియా సరైన వినియోగ విధానాలపై సవివరంగా వివరించారు.
ఉద్యాన పంటల్లో జీవ ఎరువుల వినియోగం, పోషక యాజమాన్యంపై శ్రీ సతీబాబు రైతులకు ప్రత్యేక ఉపన్యాసం అందించారు.
కార్యక్రమంలో రైతులు ఎదుర్కొంటున్న వ్యవసాయ సమస్యలపై డా. ఎన్. కిశోర్ కుమార్, శ్రీమతి తులసి, శ్రీమతి మాధురి, వ్యవసాయ అధికారులు (DRC, అనకాపల్లి) ఆధ్వర్యంలో గ్రూప్ చర్చ నిర్వహించి రైతుల సందేహాలను నివృత్తి చేశారు.
ఈ శిక్షణలో జిల్లాలోని పలువురు రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు మరియు శాస్త్రవేత్తలు పాల్గొని జీవ ఎరువులు, నానో యూరియా వినియోగంపై విలువైన సమాచారాన్ని పొందారు.