వడ్డాదిలో రైతులకు క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమం

వడ్డాదిలో రైతులకు క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమం

18/November/2026 20:38    Share:   

వరి కోత జాగ్రత్తలు, రవి పంట యాజమాన్యం, కొత్త ఎరువుల బుకింగ్ యాప్‌పై ప్రత్యేక దృష్టి

వడ్డాది: వ్యవసాయ అధికారి నారాయణ రావు ఆధ్వర్యంలో పొలంబడి రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు వివిధ అంశాలపై విస్తృత సమాచారం అందించారు.

కార్యక్రమంలో ప్రధానంగా వరి కోత సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. విత్తనం కోసం ధాన్యాన్ని ఉంచుకోవాలనుకునే రైతులు వరి కోతలను ఎలా చేపట్టాలి, కోసిన ధాన్యాన్ని ఎలా భద్రపరుచుకోవాలి అనే విషయాలను వివరంగా తెలియజేశారు. అలాగే రవి పంటకాలానికి సంబంధించి ఏ రకాలను ఎంచుకోవాలి, ప్రధాన మడులు ఎలా తయారుచేసుకోవాలి, విత్తన శుద్ధి, నారుమడి వేసే విధానం తదితర అంశాలపై రైతులకు సవివరంగా వివరించారు.

అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ప్రవేశపెట్టిన కొత్త ఎరువుల బుకింగ్ అప్లికేషన్ (FRAMEWORK FOR FERTILIZER SALE - FFS) పై రైతులకు వివరణ ఇచ్చారు. ఎరువులు అవసరమైన ప్రతి రైతు తమ స్మార్ట్‌ఫోన్‌లో ప్లే స్టోర్ ద్వారా ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. రైతు తమ ఆధార్ నంబర్ లేదా రైతు గుర్తింపు సంఖ్య (FARMER ID)తో లాగిన్ అయిన తర్వాత, తమకు ఏ పంటకు ఏ ఎరువు కావాలో తామే బుక్ చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం తమ సమీపంలోని రైతు సేవా కేంద్రం లేదా ఎరువుల దుకాణానికి వెళ్లి బుకింగ్ నంబర్ తెలియజేస్తే ఎరువులు తీసుకోవచ్చని వివరించారు. ప్రతి రైతు తమ సమీప రైతు సేవా కేంద్రం సిబ్బంది ద్వారా ఈ అప్లికేషన్‌ను తమ మొబైల్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రైతు సేవ కేంద్రం అధికారిణి రేణుక, సాయి లక్ష్మి తోపాటు పొలంబడి రైతులు పాల్గొన్నారు.

Breaking News

Subscribe our Newsletter