ఏలూరు నగరపాలక సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే బడేటి చంటి
05/July/2026 22:26
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు,
ఏలూరు నగరపాలక సంస్థలో పని చేస్తున్న ఉద్యోగ, సిబ్బందికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) తెలిపారు. ఆదివారం నాడు స్థానిక కోట దిబ్బ ఎస్ ఆర్ వన్ వద్ద ఏఐటీయూసీ అనుబంధ ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ 37వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో బడేటి చంటి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు . జాతీయ పతాకాన్ని బడేటి చంటి ఆవిష్కరించారు. యూనియన్ పతాకాన్ని ఏ ఐ టి యు సి జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి బడేటి చంటి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద బాబు నూలుపోగుల దండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు బండి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. గడిచిన రెండు సంవత్సరాల కాలంలో కార్పొరేషన్ లో ఖాళీ అయిన ఉద్యోగ సిబ్బంది పోస్టులలో ఔట్సోర్సింగ్ సిబ్బందిని నియమించి ఉద్యోగ సిబ్బందికి పని భారం లేకుండా చేసినట్లు శాసనసభ్యులు తెలిపారు. అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగ సిబ్బంది వయోపరిమితి 60 సంవత్సరాలు ఉండటం వల్ల వారు రిటైర్ అయితే వారి కుటుంబ సభ్యులలో అర్హత ఉన్నవారికి మొదటి ప్రాధాన్యతలో ఉపాధి కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా ఏఐటియుసి అనుబంధ ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు తమ దృష్టికి తీసుకువచ్చిన ఉద్యోగ సిబ్బంది సమస్యలలో తమ పరిధిలో ఉన్న వాటిని పరిష్కరించామన్నారు. అర్హత ఉన్న వారందరికీ పదోన్నతులు కల్పించమన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సహకారంతో స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహంతో నగరపాలక సంస్థ ఉద్యోగ సిబ్బంది సమస్యల పరిష్కారానికి తాము పాటుపడతామని అన్నారు. వాటర్ వర్క్స్ లో మరియు వాటర్ సప్లై విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగ సిబ్బంది సక్రమమైన పని వల్ల వేసవిలో నగర ప్రజలకు మంచినీటి ఎద్దడి లేకుండా చేశామని ఎస్ ఎం ఆర్ పెదబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బండి వెంకటేశ్వర రావు, యూనియన్ ప్రధాన కార్యదర్శి ఏ అప్పలరాజు మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఎన్ ఎం ఆర్ లను రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం 26 వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రయత్నించాలని ఎమ్మెల్యేని కోరారు. టిడిపి నగర అధ్యక్షులు మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం మాట్లాడుతూ ఏలూరు కార్పొరేషన్ లో అనేకమంది యువతకు ఉపాధి కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ యాడ్ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, యూనియన్ వ్యవస్థాపకులు మాజీ కౌన్సిలర్ చిలుకూరి రమేష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ ఏలూరు జిల్లా అధ్యక్షులు కే మహాలక్ష్ముడు తదితరులు మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి, ఎస్ఎంఆర్ పెదబాబు తదితరులు మొక్కలు నాటారు. యూనియన్ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో బి నారాయణరావు, డి వెంకటేశ్వరరావు, ఎస్ఎంవి సుబ్బారావు, సిహెచ్ అప్పారావు, బి కే డి వి ప్రసాద్, డి దుర్గారావు, కే రామచంద్రరావు, పి దుర్గారావు, ఎస్ గౌరీ శంకర్, ఎమ్మెస్ బాజీ, ఎస్కే ఆలీ తదితరులు పాల్గొన్నారు.