ఎలమంచిలి,
స్థానిక శ్రీ గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కంప్యూటర్ సైన్స్ విద్యార్థిని కుమారి తెనకల భార్గవి జాతీయ స్థాయిలో ప్రతిభ చాటింది. దేశవ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీలలో పీజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన సియుఇటి (CUET-PG 2026) ప్రవేశ పరీక్షలో ఆమె విశేష ప్రతిభ కనబరిచింది. ఫిజిక్స్ విభాగంలో జాతీయ స్థాయిలో 67వ ర్యాంకును కైవసం చేసుకుని, ప్రతిష్టాత్మక పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించింది.
ఈ ఘన విజయం సాధించిన భార్గవిని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రేమ చంద్రశేఖర్ ప్రత్యేకంగా అభినందించారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థినిని ఈ స్థాయికి తీర్చిదిద్దిన ఫిజిక్స్ విభాగాధిపతి డాక్టర్ వెంకన్నను, లెక్చరర్ శివలక్ష్మిలను ప్రిన్సిపాల్ మరియు తోటి అధ్యాపకులు ఘనంగా ప్రశంసించారు.