జులై 3,4,5 తేదీల్లో ఏలూరు వేదికగా రైతు మహాసభలు నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు..
30/June/2026 21:42
Share:
రాష్ట్ర రైతు ఉద్యమాలను దిశా నిర్దేశం చేయనున్న రైతు సంఘం రాష్ట్ర మహాసభలు..వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే విధానాలు అవసరం.. నష్టపోతున్న అన్ని పంటల రైతులను ఆదుకోవాలి..ఎరువుల ధరలు తగ్గించి పాత పద్ధతుల్లో సరఫరా చేయాలి..ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డి..
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు రాష్ట్ర రైతుల ఉద్యమాలకు జులై 3,4,5 తేదీల్లో ఏలూరులో జరగనున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలు దిశా నిర్దేశం చేయనున్నాయని, ఈ మహాసభ నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డి చెప్పారు.మంగళవారం ఏలూరులోని అల్లూరు సత్యనారాయణ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.జులై 3న మధ్యాహ్నం గంటలకు జూట్ మిల్ సెంటర్ నుండి హలో రైతన్న - చలో ఏలూరు పేరుతో రైతు మహా ప్రదర్శన, మధ్యాహ్నం 3 గంటలకు ఇండోర్ స్టేడియం గ్రౌండ్ లో బహిరంగ సభ జరుగుతుందని, 4,5 తేదీల్లో డీసీఎంఎస్ ఫంక్షన్ హాలులో ప్రతినిధుల సభ జరుగుతుందని వివరించారు. ముఖ్య అతిథులుగా అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షులు అశోక్ ధావలే, జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్, జాతీయ సహాయ కార్యదర్శి టి.సాగర్, రైతు సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు తదితర ప్రముఖులు హాజరుకానున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని రైతాంగ సమస్యలపై చర్చించి తీర్మానాలు చేయనున్నామన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి బాగాలేదని, ఏ పంటకు కనీస ధర రావడం లేదన్నారు. మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారని, మామిడికి తగిన ధర రాలేదని, పొగాకు రైతులకు పొగ పెడుతున్నారని విమర్శించారు. ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని, రోడ్లెక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితిని ప్రభుత్వాలు కల్పించాయన్నారు. భారీగా పెంచిన ఆక్వా మేతల ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆక్వా రైతుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు. వర్జీనియా పొగాకు కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్లు కేటాయించాలని కోరారు. పొగాకు కొనుగోలు వేగవంతం చేయాలన్నారు. కోకో రైతులకు తగిన ధర రాలేదని, కోకో గింజలకు ప్రైస్ పాలసీ ప్రకటించాలన్నారు.ఆయిల్ పామ్ రైతులను ఆయిల్ రికవరీ శాతం పేరుతో కంపెనీల దోపిడీ ఆపాలన్నారు. అమెరికాతో భారత్ జులై మొదటి వారంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు ప్రకటించారని, ఈ ఒప్పందం వలన మన దేశ వ్యవసారంగం తీవ్రంగా దెబ్బతింటుందని, రైతులు నష్టపోతారని ఆందోళన చేశారు. పాలు,పాల పదార్థాలు ఎటువంటి సుంకాలు లేకుండా దిగుమతి అవుతాయని, పాడి పరిశ్రమ,పాడి రైతులు దివాళా తీస్తారని చెప్పారు. మొక్కజొన్న,సోయాబీన్,పత్తి ఇతర వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి అయితే ఇప్పటికే నష్టపోతున్న ఆయా పంటల రైతులు మరింత నష్టపోతారని అన్నారు. అమెరికాతో స్వేచ్ఛా ఒప్పందాన్ని అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. వ్యవసాయంలో స్థితిగతులు చర్చించి భవిష్యత్ రైతు ఉద్యమాలకు దిశా నిర్దేశం చేయనున్న రైతు సంఘం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని అందుకు అందరూ సహకరించాలని కోరారు.ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర పూర్వ అధ్యక్షులు బి. బలరాం మాట్లాడుతూ రైతు రక్షణ,వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కృషి చేస్తోందన్నారు. వ్యవసాయంలో కీలకపాత్ర వహిస్తున్న కౌలు రైతుల పట్ల ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయని విమర్శించారు. కౌలు రైతుల రక్షణ కోసం నూతన చట్టం తేవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు సంఘం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం నాయకులు ఆర్.లింగరాజు, ఎం. నాగమణి, పి.రామకృష్ణ, డి.ఎన్.వి.డి ప్రసాద్, జి.రాజు తదితరులు పాల్గొన్నారు.