మత్తు రహిత సమాజ స్థాపనే మన లక్ష్యం: అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్*

మత్తు రహిత సమాజ స్థాపనే మన లక్ష్యం: అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్*

25/June/2026 17:03    Share:   

జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్న "నషా ముక్త్ భారత్ సప్తాహ్" వారోత్సవాలు*
 
*పరవాడ సబ్ డివిజన్ పరిధిలో పకడ్బందీ నిఘా: ఇంచార్జ్ డీఎస్పీ శ్రీ బి.మోహనరావు* 
 
*ఎలమంచిలి భాష్యం స్కూల్ వేదికగా విద్యార్థులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసిన జిల్లా ఎస్పీ*
 
*అనకాపల్లి (ఎలమంచిలి టౌన్), జూన్ 25:* నవభారత నిర్మాణంలో భాగంగా మత్తు పదార్థాల రహిత సమాజాన్ని స్థాపించడమే మన అందరి ప్రథమ కర్తవ్యమని అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు పిలుపునిచ్చారు. 
 
కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న "నషా ముక్త్ భారత్ అభియాన్" లో భాగంగా జూన్ 17 నుండి జూన్ 26 వరకు 10 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక వారోత్సవాలు (నషా ముక్త్ భారత్ సప్తాహ్) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.
 
​ఈ వారోత్సవాలలో భాగంగా నేడు ఎలమంచిలి పట్టణంలోని గాంధీనగర్ లో గల భాష్యం స్కూల్ వద్ద జరిగిన విసృత అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి, జ్యోతి ప్రజ్వలనం గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
 
*యువతే దేశ భవిష్యత్తు – ఎస్పీ గారి ముఖ్య సందేశం:* 
​ఈ సందర్భంగా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు మాట్లాడుతూ...
​"జూన్ 26న రానున్న 'అంతర్జాతీయ మత్తు పదార్థాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని' పురస్కరించుకుని ఈ అవగాహన కార్యక్రమాలను జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నాం. విద్యార్థులు, యువత తమ ఉజ్వలమైన భవిష్యత్తును పాడుచేసే అలవాట్లకు దూరంగా ఉండాలి. జిల్లా వ్యాప్తంగా మాస్ ప్లెడ్జ్ డ్రైవ్‌లు, అవగాహన ర్యాలీలు, వీధి నాటకాలు మరియు సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా ప్రజల్లో చైతన్యం తెస్తున్నాం. ప్రతి పౌరుడూ ఒక 'నషా ముక్తి మిత్ర' గా మారాలి."
 
*క్షేత్రస్థాయిలో కఠిన నిఘా – పరవాడ సబ్ డివిజన్ ఇంచార్జ్ డీఎస్పీ శ్రీ బి.మోహనరావు* 
గారు మాట్లాడుతూ, మత్తు పదార్థాల నిర్మూలనకు క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న చర్యలను వివరించారు:
​"గౌరవనీయులైన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం పరవాడ సబ్ డివిజన్ పరిధిలో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల రవాణా, విక్రయాలపై అత్యంత కఠినమైన నిఘా ఏర్పాటు చేశాం. ముఖ్యంగా విద్యాసంస్థల పరిసర ప్రాంతాల్లో, యువత ఎక్కువగా గుమిగూడే ప్రదేశాలలో ప్రత్యేక బృందాలతో నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నాం.
​చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయడానికి సైతం వెనుకాడం. కేవలం చట్టపరమైన చర్యలకే పరిమితం కాకుండా, రూట్ లెవెల్‌లో మార్పు కోసం రూరల్ ప్రాంతాల్లో, పంచాయతీలు, మహిళా సంరక్షణ కార్యకర్తలతో కలిసి విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ప్రజలకు, విద్యార్థులకు ఎక్కడైనా మత్తు పదార్థాల అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి; సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత రహస్యంగా ఉంచబడతాయి."
 
*సమసమాజ నిర్మాణానికి ప్రతిజ్ఞ:* 
​అనంతరం ఎలమంచిలి సిఐ ధనుంజయ రావు విద్యార్థులతో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని, దేశ నిర్మాణంలో భాగస్వాములం అవుతామని ప్రతిజ్ఞ చేయించారు.
 
ఈ భారీ అవగాహన కార్యక్రమంలో పరవాడ సబ్ డివిజన్ ఇంచార్జ్ డీఎస్పీ శ్రీ బి.మోహనరావు, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీ ఈ.శ్రీనివాసులు, ఎలమంచిలి సీఐ ధనుంజయరావు, ఎన్.డి.పి.ఎస్ సిఐ పిల్లా రమేష్ ఎస్సైలు సావిత్రి, ఉపేంద్ర, రామకృష్ణారావు, ప్రసాదరావు మరియు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఐసిడిఎస్ సిబ్బంది, భాష్యం పాఠశాల యాజమాన్యం మరియు పెద్ద సంఖ్యలో వివిధ కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు.
 
*​జూన్ 26న ముగింపు వేడుకలు:* 
ఈ 10 రోజుల ప్రత్యేక వారోత్సవాలు జూన్ 26వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో, జిల్లా వ్యాప్తంగా మరిన్ని ముమ్మర కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పోలీస్ శాఖ తెలిపింది.
 
Breaking News

Subscribe our Newsletter