అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో

అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో 'కిమ్స్ ఐకాన్' సూపర్ స్పెషాలిటీ సేవలు!

20/June/2026 11:59    Share:   

అనకాపల్లి:
అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ వైద్యాలయంలో పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించేందుకు సరికొత్త ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ప్రముఖ ప్రైవేట్ సంస్థ ‘కిమ్స్ ఐకాన్ హాస్పిటల్’ భాగస్వామ్యంతో పీపీపీ (PPP) మోడల్‌లో ఇక్కడ అత్యంత ఆధునిక సూపర్ స్పెషాలిటీ సేవలను ప్రారంభించబోతున్నారు.
ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో డీసీహెచ్‌ఎస్ శ్రీనివాసరావు, కిమ్స్ రీజనల్ సీఈఓ డాక్టర్ కొణతాల నాగేశ్వరరావు, సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ ఈ మెగా ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, స్థానిక ఎమ్మెల్యే కొణతాల AMC రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్ ల సంపూర్ణ సహకారంతో ఈ పనులు ముమ్మరంగా జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
 
 అప్‌గ్రేడ్ అవుతున్న వైద్య సేవలు - ముఖ్యాంశాలు:
డిజిటల్ హెల్త్ కార్డ్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రోగులందరికీ 'ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్' యూనిక్ ఐడీ కార్డులు జారీ చేయనున్నారు. దీనివల్ల రోగి దేశంలో ఎక్కడికెళ్లినా వారి పాత మెడికల్ హిస్టరీ ఆధారంగా తక్షణ చికిత్స అందించవచ్చు.
ల్యాబ్ పరీక్షల విస్తరణ: ప్రస్తుతం ఉన్న ల్యాబ్ సామర్థ్యాన్ని రోజుకు 2,000 నుండి ఏకంగా 3,000 పరీక్షలకు పెంచుతున్నారు. సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్, ఎక్స్-రే వంటి రేడియాలజీ విభాగాలను అత్యాధునిక పరికరాలతో ఆధునీకరిస్తున్నారు.
400 పడకల ఆస్పత్రి: ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రత్యేక చొరవతో ప్రస్తుతం ఉన్న 200 పడకల ఆసుపత్రిని 400 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసేందుకు అదనపు భూమి సేకరణ ప్రక్రియ తుది దశకు చేరింది.
97% ఉచిత మందులు: రోగులకు ఎలాంటి కొరత లేకుండా ఆసుపత్రిలో ఎల్లప్పుడూ 97 శాతానికి పైగా మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులను సమర్థవంతంగా వినియోగిస్తున్నారు.
 
 మౌలిక వసతుల కల్పన:
ఆసుపత్రి లోపలి మౌలిక వసతులను పూర్తిగా మార్చేస్తున్నట్లు కమిటీ డైరెక్టర్ ఆళ్ల ఇందు రామచంద్రరావు తెలిపారు. అత్యవసర వైద్య సేవల కోసం 'క్రిటికల్ కేర్ బిల్డింగ్' పనులను వేగవంతం చేశారు. ₹31 లక్షలతో సిసిటివి కెమెరాల ఏర్పాటు, డిజిటల్ భవనాల పునరుద్ధరణ పనులు మరియు ₹18 లక్షలతో ఆసుపత్రి ఆవరణలో సరికొత్త సీసీ రోడ్ల కనెక్టివిటీ పనులు వేగంగా జరుగుతున్నాయి. రోగుల సహాయకుల కోసం ప్రత్యేకంగా ‘పేషెంట్ వెయిటింగ్ హాల్’ సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నారు.
కాగా, అద్భుతమైన ప్రసూతి సంరక్షణ, అత్యవసర ప్రసవాల సేవలను (NBSU) అందిస్తున్నందుకు గాను ఈ ఆసుపత్రి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక ప్రశంసలు అందుకోవడం విశేషం.
శ్రీనివాస రావు. ఎ 
జిల్లా ఇన్చార్జి
క్రైమ్ ఎనాలిసిస్ 
అనకాపల్లి .
Breaking News

Subscribe our Newsletter