నీట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి: అధికారులకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశం
19/June/2026 20:11
Share:
జిల్లాలో ఈనెల 21వ తేదీన జరగనున్న నీట్ పరీక్ష ను ఎటువని పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి గురువారం సాయంత్రం జిల్లాలో నీట్ పరీక్ష నిర్వహణపై అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో నీట్ పరీక్ష ఈనెల 21వ తేదీన 6 కేంద్రాలలో మధ్యాహ్నం 2 గంటల నుండి 5.15 ని.ల వరకు జరుగుతుందన్నారు. పరీక్షకు సంబందించిన ఓఎంఆర్ షీట్లు జిల్లాకు వచ్చిన దగ్గర నుండి పరీక్ష అనంతరం తిరిగి పంపించే వరకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలనీ పోలీస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పరీక్షా పత్రాలను స్ట్రాంగ్ రూంలో భద్రపరిచే ప్రదేశంలో సిఏపిఎఫ్ భద్రతా సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్ష సమయానికి ముందు నుండి పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్ షాపులు, ఇంటర్నెట్ సెంటర్లు మూసి వేయించాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ లు, పరీక్ష కేంద్రాల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటుచేయాలని, అంతరాయం లేని విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా పత్రాలను కేంద్రాలకు తరలించే సమయంలో మరింత భద్రత ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించాలని ఏలూరు ఆర్డీఓ ని కలెక్టర్ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద పారిశుద్ధ్యం, త్రాగునీటి సౌకర్యం ఏర్పాటుచేయాలని ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్, డిపిఓ లను కలెక్టర్ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద వైద్య శిబిరాలను ఏర్పాటుచేయాలనీ, వీల్ చైర్స్, స్ట్రెచర్లు అందుబాటులో ఉంచాలని డిఎంహెచ్ఓ ని కలెక్టర్ ఆదేశించారు. పరీక్షా కేంద్రాలకు తగినన్ని ఆర్టీసీ బస్సులు ఏర్పాటుచేయాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థినీ, విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి జిల్లాలో నీట్ పరీక్ష నిర్వహించాలని కలెక్టర్ వెట్రిసెల్వి సూచించారు.జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, డిఆర్ఓ దేవకీదేవి, ఆర్డీఓ లక్ష్మి ప్రసన్న, డిపిఓ మల్లికార్జునరావు, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ . భాను ప్రతాప్,ట్రాన్స్కో ఎస్ఈ బి.ఎం.అంబేద్కర్ , డిఎంహెచ్ఓ డా. శోభ, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, డిఎస్పి శ్రావణ్ కుమార్, ఎల్డిఎం నీలాద్రి, నీట్ పరీక్షల సమన్వయాధికారి, పాల్గొన్నారు.