కొల్లేరు నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ కార్యాచరణ!
16/June/2026 21:22
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు. కొల్లేరు 5వ కాంటూర్ పరిధిలోని జిరాయితీ, డి.ఫారం భూమిదారులు సమస్యలు పరిష్కారానికి పునరావాస కార్యక్రమాలుపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించి సమర్పించాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక కలెక్టరేటులోని గౌతమీ సమావేశపు హాలులో సోమవారం కైకలూరు ఎమ్మెల్యే డా.కామినేని శ్రీనివాస్, చీఫ్ కన్జర్వేటర్ అఫ్ ఫారెస్ట్ నాగేశ్వరరావు, జ్యోతి లు పాల్గొన్నారు. కొల్లేరు అభయారణ్య పరిధిలో వన్యప్రాణి సంరక్షణ చట్టం అమలు, జిరాయితీ, డి.ఫారం భూమిదారులు సమస్యలు పరిష్కారం, పునరావాస కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించడంపై అధికారులతో జిల్లా కలెక్టరు సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జాతీయ వన్యప్రాణులు బోర్డు 48వ స్థాయి కమిటీ సమావేశం సిఫారసులు అనుసరించి కొల్లేరు అభయా అరణ్యం పరిధిలో వన్యప్రాణి సంరక్షణ చట్టం అమలు ముఖ్యమైనదని తెలిపారు. 5వ కాంటూరు పరిధిలోని జిరాయితీ, డి.ఫారం భూములు సుమారు 20 వేల ఎకరాలు వరకు ఉంటాయని, వారి సమస్యలు పరిష్కారానికి, వారికి కల్పించవలసిన పునరావాస కార్యక్రమాలుపై సుప్రీం కోర్టు సాధికార కమిటీకి నివేదిక సమర్పించవలసి ఉన్నందున జిరాయితీ, డి.ఫారం భూములు విస్తీర్ణం, సరిహద్దులు, భూమి దారులు వివరాలు, తదితర సమాచారంతో సవివరమైన కార్యాచరణ ప్రణాలికను రూపొందించి సమర్పించాలని అధికారులను జిల్లా కలెక్టరు ఆదేశించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా.కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ కొల్లేరు సమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్త శుద్ధితో పనిచేయడంతో 95 శాతం పూర్తయిందని, సుప్రీంకోర్టు నుంచి త్వరలో అనుమతులు వస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కొల్లేరు సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నానని, దీనికి తోడు జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. కొల్లేరు సంబంధించి శాశ్వత పరిష్కారం దిశగా చేస్తున్న ప్రయత్నంలో కమిటీ అడిగిన నివేదికలను పూర్తిస్థాయిలో వారికి పంపడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచెయ్యాలని కోరారు. రెవెన్యూ సంబంధించిన 22ఏ సమస్యలు ఇంకా వైవాక, భాస్కరరావుపేట, కలిదిండిలో మిగిలిన ఫైల్స్ త్వరిత గతిన పరిష్కరించాలని కోరారు.సమావేశంలో జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ, డిఎఫ్ఓ త్రిమూర్తులు రెడ్డి, ఇంచార్చి డిఆర్ఓ ఎల్.దేవకీ దేవి, ఆర్డీఓ కె.లక్ష్మిప్రసన్న, సర్వే సహాయ సంచాలకులు అన్సారీ, అటవీశాఖ అధికారులు, డిఐఓఎస్ టి.బి. యస్.రమణారావు, తహశీల్దార్లు, ఇరిగేషన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.