జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ లోన్  బాధితుల చలో ఏలూరు కలెక్టరేట్..

జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ లోన్  బాధితుల చలో ఏలూరు కలెక్టరేట్..

15/June/2026 20:58    Share:   

బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకున్న రైతులు, ఇతర బాధితులకు తక్షణం న్యాయం చేయాలి.మా బంగారం మాకు ఇప్పించండి అంటూ జిల్లా కలెక్టరేట్ ముందు గోల్డ్ లోన్ బాధితులు ధర్నా... 
గోల్డ్ గోల్ మాల్ పై సమగ్ర విచారణ జరపాలి.. దొంగలను కఠినంగా శిక్షించాలి..
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,
ఏలూరు 
జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ లోన్ బాధితులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం చలో ఏలూరు కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 
మా బంగారాన్ని మాకు ఇప్పించండి అంటూ జిల్లా పరిషత్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టరేట్ ముందు గోల్డ్ లోన్ బాధితులు ధర్నా నిర్వహించారు. సమగ్ర విచారణ వెంటనే పూర్తి చేసి న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కుటుంబ మరియు వ్యవసాయ అవసరాల నిమిత్తం జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా లో రైతులు,చిరు వ్యాపారులు,వృత్తిదారులు, ఇతరులు అనేక మంది తమ బంగారాన్ని తాకట్టు పెట్టి గోల్డ్ లోన్ తీసుకున్నారని, వారు తాకట్టు పెట్టిన గోల్డ్ గోల్ మాల్ అయిందన్నారు. వారు తాకట్టుకు వచ్చిన బంగారం బ్యాంకులో లేదని, ఆ బంగారం స్థానంలో ఇనుప వస్తువులు, సుద్ద ముక్కలు వంటివి పెట్టి తాకట్టు పెట్టిన బంగారాన్ని బ్యాంకు అధికారులే దొంగతనం చేశారని చెప్పారు. తప్పుడు పత్రాలు, ఆన్ లైన్ లో తప్పుడు లెక్కలు చూపించి జిల్లాలో అతిపెద్ద స్కాం కు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న బంగారాన్ని ఎంతో నమ్మకంతో తాకట్టు పెడితే బ్యాంక్ అధికారులే గోల్ మాల్ చేయడం దుర్మార్గమని విమర్శించారు. గత పది రోజులుగా పెద్ద ఎత్తున బ్యాంకు ముందు ఆందోళన చేస్తున్న బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. సమగ్ర విచారణ వెంటనే పూర్తి చేసి గోల్డ్ లోన్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితుల బంగారం బాధితులకు అందే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్.లింగరాజు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ లోన్ బాధితులకు సిపిఎం అండగా ఉంటుందని ప్రకటించారు. బాధితుల పోరాటానికి మద్దతు తెలియజేశారు. బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారానికి గ్యారెంటీ లేకపోవడం దారుణమన్నారు. ఈ బ్యాంకులో 2,600 వరకు ఖాతాలు ఉంటే ఇప్పటివరకు 1600 ఖాతాదారులను విచారణ చేశారని, మిగిలిన విచారణ వెంటనే పూర్తి చేయాలని కోరారు. 82 బ్యాంకు ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారంలో 4 కేజీల 28 గ్రాములు కనిపించడం లేదని, మిగిలిన ఖాతాదారుల బంగారం కూడా పరిశీలిస్తే ఆ బంగారం 15 కేజీల వరకు ఉండవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నతాధికారులు యుద్ధ ప్రాతిపదిక బాధితుల బంగారాన్ని బాధితులకు అప్పగించేలా చర్యలు చేపట్టాలన్నారు.
గోల్డ్ లోన్ బాధితులు కొప్పుల సత్తిరెడ్డి,గెడా ఆనంద ప్రసాద్, తలారి నందిని, ఆర్.దుర్గాభవాని, గోలి కృష్ణారెడ్డి, కోనా రాము తదితరులు మాట్లాడుతూ బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేము తాకట్టు పెట్టిన బంగారం కనిపించడం లేదని, బ్యాంకు అధికారులే మా బంగారాన్ని కాజేశారని ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ అవసరాల కోసం బంగారాన్ని తాకట్టు పెడితే మమ్మల్ని మోసం చేయడం దారుణమని, గత పది రోజులుగా ఆందోళన చేస్తున్నా అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మా బంగారాన్ని మాకు ఇప్పించేలా బ్యాంక్ ఆఫ్ బరోడా ఉన్నతాధికారుల నుండి మాకు స్పష్టమైన హామీ పత్రాలు ఇప్పించాలని, వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
బంగారం గోల్ మాల్ పై స్పందించిన జిల్లా కలెక్టర్..
ధర్నా అనంతరం గోల్డ్ లోన్ బాధితులు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం,సిపిఎం నాయకులు జిల్లా కలెక్టరేట్ లోని పి జి ఆర్ ఎస్ కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి స్పందిస్తూ గోల్డ్ లోన్ బాధితులకు బంగారం అందేలా బ్యాంక్ ఆఫ్ బరోడా రీజినల్ మేనేజర్ హామీ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ కు ఆమె ఆదేశం జారీ చేశారు. సమగ్ర విచారణ పూర్తి చేస్తున్నామని న్యాయం చేస్తామని కలెక్టర్ చెప్పారు.
 ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన గోల్డ్ లోన్ బాధితులు కలగర రామారావు, సిహెచ్.సత్యనారాయణ, కొఠారి చంద్రశేఖర్, ఆరేపల్లి రామారావు,మల్లాపు లక్ష్మీపార్వతి, బి.వెంకటేశ్వరరావు, గుత్తా సీతారాములు, చిలుకూరి అచ్చిరెడ్డి, పొరపాటి ఏసు, నాకిరెడ్డి లక్ష్మీప్రసన్న, సిహెచ్.శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter