యలమంచిలి మండలం కొక్కిరాపల్లి.లారీ ఢీకొని ఇద్దరు దుర్మరణం..!!
14/June/2026 20:36
Share:
క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ : అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం కొక్కిరాపల్లి జంక్షన్ సమీప జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.పోలీసుల వివరాల ప్రకారం, ఒడిశా నుంచి కాకినాడకు వరి కటింగ్ మిషన్‌ను తీసుకెళ్తున్న AP 05 TA 6929 నంబరు గల ఐచర్ వ్యాన్ యాంత్రిక లోపంతో రహదారిపై నిలిచిపోయింది. వాహనాన్ని పరిశీలించేందుకు వ్యాన్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులు వెనుక భాగంలో నిలబడి ఉండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన AP 27 TY 2955 నంబరు గల కంటైనర్ లారీ వ్యాన్‌ను బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో వ్యాన్ వెనుక ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో హైవే అంబులెన్స్ ద్వారా అనకాపల్లిలోని ఎన్‌టీఆర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు.మృతుల్లో ఒకరు వరి కటింగ్ మిషన్ యజమాని, కాకినాడ జిల్లా కరప మండలం గొడ్డటిపాలెం గ్రామానికి చెందిన వాసంశెట్టి సుబ్రమణ్యం కాగా, మరొకరు వ్యాన్ డ్రైవర్, ఒడిశాకు చెందిన రతన్ పూజారిగా గుర్తించారు.మృతుడు సుబ్రమణ్యం బావ ఇచ్చిన ఫిర్యాదు మేరకు యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఉపేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.