పంట రుణాల మంజూరులో కౌలు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలి

పంట రుణాల మంజూరులో కౌలు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలి

11/June/2026 20:34    Share:   

రైతులు, ఎంఎస్ఎంఈ, విద్య, ముద్రా రుణాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి  నిర్దేశిత లక్ష్యాలు సాదించాలి
సైబర్ మోసాలపై ఫిర్యాదుకు 1930 టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ పై  రైతులకు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులకు  అవగాహన కలిగించాలి
పంటల భీమా, పశు భీమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి భీమా ప్రీమియం లు చెల్లించేలా చూడాలి
బ్యాంకర్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్  కె.వెట్రిసెల్వి
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు, 
జిల్లాలో రుణాల అర్హత కార్డులు కలిగిన ప్రతీ కౌలు రైతుకు సాగుకు రుణ సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి బ్యాంకర్లను ఆదేశించారు.  స్థానిక కలెక్టరేట్ లో బుధవారం జిల్లా బ్యాంకర్ల సమీక్షా సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది . ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ  జిల్లాలో 65 వేల మందికి పైగా కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు జారీ చేశామని, వీరిలో కేవలం 23 వేల మంది కౌలు రైతులకు మాత్రమే 375 కోట్ల రూపాయల రుణాల మంజూరు లక్ష్యానికి గాను కేవలం 124 కోట్ల రూపాయలు మాత్రమే మంజూరు చేయడంపై బ్యాంకర్ల పనితీరుపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, సాగులో 90 శాతానికి పైగా ఉన్న కౌలు రైతులకు పరపతి సౌకర్యాన్ని విరివిగా అందించాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందన్నారు. కౌలు రైతులకు పంటరుణాలు మంజూరులో ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని, ఇందులో ఎటువంటి రాజీకి అవకాశం లేదన్నారు. మిగిలిన కౌలు రైతులకు కూడా సాగు రుణాలు అందించి లక్ష్యాలను సాధించాలని బ్యాంకర్లను కలెక్టర్ ఆదేశించారు.  జిల్లాలో గత ఆర్ధిక సంవత్సరంలో వార్షిక రుణ ప్రణాళికలో ప్రాధాన్యతా రంగాలలో వ్యవసాయ అనుబంధ రంగాలకు 13 వేల  845 కోట్ల రూపాయల రుణాల లక్ష్యానికి గాను, 18 వేల 065 కోట్ల రూపాయలు రుణాలు అందించి లక్ష్యాలను సాధించారన్నారు. ఎంఎస్ఎంఈ లకు సంబంధించి 3,343 కోట్ల రూపాయల రుణాల లక్ష్యాలకు గాను కేవలం 2762 కోట్ల రూపాయలు మాత్రమే లక్ష్యాలను సాధించారని, లక్ష్య సాధన చేయని బ్యాంకర్లు తమ కేటాయించిన లక్ష్యాల మేర సాధించాలని కలెక్టర్ చెప్పారు. 
రుణ అర్హత కలిగిన రైతులు, పాడిరైతులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు,  ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సంబంధిత అధికారులు, బ్యాంకర్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రుణాల మంజూరుకు రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను బ్యాంకర్లు తెలుసుకుని వాటిని అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ దిశగా బ్యాంకర్లు, అధికారులు కృషిచేస్తే వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను త్వరితగతిన సాదించేందుకు వీలుకలుగుతుందన్నారు.  జిల్లాలో వివిధ రకాల పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు ఎంతో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని, పారిశ్రామిక ప్రగతికి దోహదపడేవిధంగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లను స్థాపించే వారిని ప్రోత్సహించేవిధంగా బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ వర్గాలకు అందిస్తున్న పధకాలను అర్హులైన ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకునేందుకు మరియు రుణాల మంజూరులో సమస్యల పరిష్కారానికి లబ్ధిదారులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ బ్యాంకర్లను ఆదేశించారు. 
సైబర్ మోసాలపై ఫిర్యాదుకు 1930 టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ పై  అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి  ఇటీవల సమాజంలో బాగా పెరిగిన సైబర్ మోసాలపై వాటి  బారిన పడకుండా తీసుకోవలసిన చర్యలపై  గ్రామస్థాయిలో రైతులు, డ్వాక్రా మహిళలకు, విద్యార్థులకు అవగాహన కలిగించాలన్నారు. ఎవరైనా సైబర్ మోసానికి గురై తమ డబ్బులను పోగొట్టుకుంటే వాటిపై వెంటనే 1930  టోల్ ఫ్రీ నెంబర్ కు  ఫిర్యాదు చేసేలా వారిలో అవగాహన పెంచేలా కార్యక్రమాలు నిర్వహించాలని బ్యాంకర్లను కలెక్టర్ ఆదేశించారు.  
సమావేశంలో యూనియన్ బ్యాంకు  డిప్యూటీ రీజినల్ హెడ్ సత్యనారాయణరెడ్డి   ఆర్బీఐ ప్రతినిధి డి. కిరణ్ కుమార్, ఎల్డిఎమ్ నీలాద్రి, నాబార్డ్ డిసిఎం అనిల్ కాంత్, ట్రాన్స్కో ఎస్ఈ బి.ఎం. అంబేద్కర్ ,  డి ఆర్ డి ఏ ప్రాజెక్ట్ అధికారి విజయలక్ష్మి, పరిశ్రమల శాఖ జీఎం. వెంకటరావు, వ్యవసాయ శాఖ, మత్స్య శాఖ, పశుసంవర్ధక శాఖల  జేడీలు హబీబ్ భాష, రాజ్ కుమార్, గోవిందరాజులు,   ఉద్యానవన శాఖ డిడి షాజా నాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి ముక్కంటి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి జితేంద్ర బాబు, మెప్మా పీడీ రాజబాబు, వివిధ బ్యాంకులు ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter