విత్తన గుళికల తయారీపై రైతులకు అవగాహన
అచ్యుతాపురం (అనకాపల్లి జిల్లా):
ఎల్ నీనో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున, రైతులు ప్రత్యామ్నాయ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అలవర్చుకోవాలని అనకాపల్లి జిల్లా డీపీఎం శ్రీ Ch. లచ్చన్న మరియు రీజినల్ అధికారి శ్రీ G. హేమసుందర్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా మంగళవారం అచ్యుతాపురం మండలం హారపాలెం గ్రామంలో వరి మరియు అనుబంధ పంటలకు సంబంధించిన విత్తన గుళికల (సీడ్ బాల్స్) తయారీ, లైన్ సోయింగ్ (వరుసల పద్ధతిలో విత్తడం) కార్యక్రమాన్ని నిర్వహించారు.
విత్తన గుళికల విశిష్టత:బీజామృతం, బంకమట్టి పొడి, ఘన జీవామృతం పొడి, మరియు బూడిద పొడిని పొరలు పొరలుగా అమర్చుతూ విత్తనం సైజు కంటే ఐదు రెట్లు పెరిగేలా ఈ గుళికలను తయారు చేస్తారు. తక్కువ వర్షపాతం ఉన్నప్పటికీ, ఎప్పుడు వర్షం పడినా ఈ గుళికల్లోని విత్తనాలు సులభంగా మొలకెత్తుతాయి.బహుళ పంటల సాగుతో స్థిరమైన ఆదాయం:
ప్రధాన పంటలైన వరి, మొక్కజొన్నలతో పాటు అనుబంధ పంటలైన కంది, అపరాలు, బెండ, సజ్జలు, అలసందలు, జొన్నలు, గోరుచిక్కుడు వంటి వాటిని కూడా విత్తన గుళికలుగా మార్చి లైన్ సోయింగ్ విధానంలో సాగు చేయడం జరిగింది. దీనివల్ల తక్కువ నీటితోనే అన్ని పంటలు మొలకెత్తి, రైతులకు స్థిరమైన మరియు అదనపు ఆదాయం లభిస్తుందని అధికారులు వివరించారు.
ఈ వినూత్న కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులతో పాటు రైతు మాస్టర్ ట్రైనర్లు, ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలు మరియు స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.