ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభల "లోగో " ఆవిష్కరణ.

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభల "లోగో " ఆవిష్కరణ.

30/March/2026 07:23    Share:   

రైతు సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి.
జూన్ 3న ఏలూరులో వేలాది మందితో రైతు ప్రదర్శన, బహిరంగ సభ.. 
మూడు రోజులు పాటు 500 మంది ప్రతినిధులతో మహాసభ..
రెండు నెలలపాటు రాష్ట్ర మహాసభలు సందర్భంగా సదస్సులు, సెమినార్లు,ప్రచార కార్యక్రమాలు..
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు మార్చి 29:
#  జూన్ 3, 4, 5 తేదీలలో ఏలూరులో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభల "లోగో " ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం పవర్ పేటలోని అన్నే భవనంలో నిర్వహించారు.
రైతు సంఘం రాష్ట్ర మహాసభ "లోగో"ను వ్యవసాయ శాఖ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ జి.ప్రసాదరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలను అందరూ సహకరించి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతాంగ సమస్యల పరిష్కార వేదికగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కృషి చేస్తోందని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు  ఎ. రవి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి  కె. శ్రీనివాస్ మాట్లాడుతూ నేడు రైతుల వ్యవసాయం సంక్షోభంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు అందడం లేదని ఫలితంగా అన్నదాతలు నష్టపోతున్నారని చెప్పారు. దేశంలో రైతాంగ ఆత్మహత్యలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు రక్షణ, వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పనిచేస్తుందని చెప్పారు. వరి, మొక్కజొన్న, ఆక్వా, పామాయిల్, కోకో,కొబ్బరి, మిర్చి, కూరగాయలు తదితర ఉద్యాన, వాణిజ్య, ఆహార పంటల సమస్యలపై రైతు సంఘం పోరాటాలు చేస్తోందని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం అనే ఉద్యమాలు చేసిందని, భూ సేకరణలో భూములు కోల్పోతున్న రైతాంగానికి  న్యాయమైన పరిహారం కోసం పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. రైతు సంఘం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జూన్ 3న వేలాది మందితో రైతు ప్రదర్శన, బహిరంగ సభ, మూడు రోజులు పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి వచ్చిన 500 మంది రైతు ప్రతినిధులతో మహాసభ జరుగుతుందని చెప్పారు. రెండు నెలలపాటు రాష్ట్ర మహాసభల విజయవంతం కోసం గ్రామ గ్రామాన విస్తృత ప్రచార కార్యక్రమాలు, సదస్సులు, సెమినార్లు నిర్వహిస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర మహాసభలు విజయవంతానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి  పి. రామకృష్ణ,సీఐటీయూ నాయకులు పంపన రవికుమార్, రైతు సంఘం నాయకులు తలారి జయరాజు, బైరెడ్డి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter