విశాఖ రైల్వే జోన్ సాధనలో కొణతాల పోరాటం చిరస్మరణీయం
03/June/2026 09:48
Share:
విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే (SCoR) జోన్ ఈ ఏడాది జూన్ 1 నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించడం ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల ఆకాంక్షకు నెరవేరిన ఘట్టంగా నిలిచింది. భారతీయ రైల్వేలో 18వ మరియు సరికొత్త రైల్వే జోన్‌గా అవతరించిన ఈ జోన్ ఏర్పాటుకు అనేక మంది నాయకులు, ప్రజాసంఘాలు చేసిన కృషిలో మాజీ మంత్రి, ప్రస్తుత అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ పాత్ర విశేషంగా నిలిచింది. ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్‌గా వ్యవహరించిన కొణతాల రామకృష్ణ, విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకువచ్చారు. జోన్‌ను ఇతర డివిజన్లలో విలీనం చేయకుండా విశాఖపట్నంలోనే ప్రధాన కార్యాలయంతో ఏర్పాటు చేయాలంటూ ప్రజా ఉద్యమాలు, సంతకాల సేకరణ కార్యక్రమాలు, ఢిల్లీలో అధికార ప్రతినిధి బృందాలతో సమావేశాలు నిర్వహించారు. ఈ ఉద్యమంలో భాగంగా 2019 జనవరి 27న విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీ వరకు వినూత్న రైలు యాత్ర నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైన ఈ నిరసన యాత్ర జనవరి 29న న్యూఢిల్లీ చేరే వరకు కొనసాగింది. అనంతరం రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించి, పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలను కలిసి ప్రత్యేక రైల్వే జోన్ కోసం కేంద్ర రైల్వే మంత్రిని కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు. ఆ రోజు కొణతాల రామకృష్ణ చేపట్టిన రైలు యాత్ర నిరసన కార్యక్రమం నేడు ఫలితాన్ని ఇచ్చిందని పలువురు ఉత్తరాంధ్ర వాసులు అభిప్రాయపడుతున్నారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభం కావడం ప్రాంత అభివృద్ధికి కొత్త దారులు తెరుస్తుందని పేర్కొంటున్నారు.