కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు,:
రానున్న వర్షాకాలంలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో తీసుకోవలసిన ముందస్తు చర్యలపై సన్నద్ధత ప్రణాళిక ను శాఖల వారీగా వారంలోగా సమర్పించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి గురువారం వరదలపై సన్నద్ధత, జనగణన, ఎలెక్షన్స్ ఎస్.ఐ.ఆర్., 22 ఏ కేసులు, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్క్షన్ , 2 ఏళ్ల పాలన కార్యక్రమం, యోగాంధ్ర, తదితర అంశాలపై జిల్లా, మండల స్థాయి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ తుఫానులు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్ట నివారణకు తీసుకోవలసిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులు సన్నద్ధత ప్రణాళికలు రూపొందించి సమర్పించాలన్నారు. వరదలు సమయంలో గండ్లు పడే అవసకం ఉన్న కాలువలు, చెరువులు, వంటి నీటి వనరులను ముందుగానే గుర్తించి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. రవాణా, విద్యుత్ ఎటువంటి అంతరాయం లేకుండా ఉండేలా ముందుగానే సిబ్బంది ఏర్పాట్లు చేయాలన్నారు. సమస్యాత్మక గ్రామాలను ముందుగానే గుర్తించి, ఆయా ప్రాంతాలలో ప్రజలకు ఎటువంటి సమస్యలు కలగకుండా తీసుకోవలసిన చర్యలపై ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. జనగణన పనిని శుక్రవారం సాయంత్రం లోగా పూర్తిచేయాలన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్వే ని రెండురోజుల్లో 70 శాతం మేర పూర్తిచేయాలని, ఈనెల 13, 14 తేదీలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలన్నారు. కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం వివిధ పధకాల ద్వారా ప్రజలకు అందించే సేవల్లో ప్రజలు సంతృప్తి స్థాయి మరింత పెరగాలని, తక్కువ శాతంలో ఉన్న శాఖల అధికారులు తమ పనితీరును మరింత మెరుగుపరుచుకుని వారి శాఖల సేవల పట్ల ప్రజల సంతృప్తి పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లు పూర్తి ఐన సందర్భంగా 'రెండేళ్ల నమ్మకం..అభివృద్ధి.. సంక్షేమం' కార్యక్రమం ఈనెల 16వ తేదీన ఏలూరు లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో మట్టి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, మట్టిని అక్రమంగా తరలించే వారిపై కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేయాలన్నారు. పాఠశాల, కళాశాలల విద్యార్థినీ, విద్యార్థులను యోగాంధ్ర కార్యక్రమంలో నమోదు చేసి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలన్నారు.
జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, ఇంచార్జ్ డిఆర్ఓ దేవకీదేవి, డిఎఫ్ఓ సందీప్ రెడ్డి, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఆర్డీఓ లు లక్ష్మి ప్రసన్న, రమణ, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ . భానుప్రతాప్, గృహ నిర్మాణ శాఖ పిడి సత్యనారాయణ, జిల్లాలోని తహసీల్దార్లు,ఎంపిడిఓ లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.