అనకాపల్లి:
కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా అనకాపల్లి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) శ్రేణులు చేపట్టిన భారీ బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం నియోజకవర్గ నాయకుడు మలసాల భరత్ కుమార్ పిలుపు మేరకు సుమారు 2 వేల మంది కార్యకర్తలు, అభిమానులు ద్విచక్ర వాహనాలతో ఈ నిరసన కార్యక్రమానికి తరలివచ్చారు. అయితే, ర్యాలీ సగంలో ఉండగానే పోలీసులు రంగప్రవేశం చేసి దాన్ని అడ్డుకుని, అర్ధాంతరంగా నిలిపివేశారు.
కూటమి పాలనలో అభివృద్ధి శూన్యం: మాజీ ఎంపీ సత్యవతి
ర్యాలీ భగ్నమైన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ డాక్టర్ సత్యవతి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా, పాత వితంతు పెన్షన్లను కూడా నిలిపివేశారని ఆరోపించారు. ఇప్పటికే నాలుగు సార్లు పెట్రోల్ ధరలను పెంచి ప్రజలపై మోయలేని భారం మోపారని, ఈ పాలనతో విసిగిపోయిన ప్రజలు రాబోయే 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడం ఖాయమని ఆమె అన్నారు.
ధరల పెరుగుదలపై నేతల మండిపాటు
జిల్లా నియోజకవర్గ పార్టీ ప్రెసిడెంట్ బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పూర్తిగా వెనుకబడిందని అన్నారు. గత వైఎస్సార్ ప్రభుత్వంలో కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేవని గుర్తుచేశారు. మరో నాయకుడు దంతులూరి దిలీప్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీకి రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతోందని, ఏపీ మళ్లీ అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్ పార్టీ అధికారంలోకి రావాలని మలసాల భరత్ కుమార్ స్పష్టం చేశారు.
అనుమతి ఉన్నా అడ్డుకున్నారు:
"ఈ ర్యాలీ నిర్వహణ కోసం వారం రోజుల ముందే పోలీస్ కమిషనర్‌ను కలిసి ముندస్తు అనుమతి తీసుకున్నాం. అన్ని చట్టపరమైన అనుమతులు ఉన్నప్పటికీ, ఈరోజు అకస్మాత్తుగా పోలీసులు వచ్చి మా ప్రజాస్వామ్య ర్యాలీని అడ్డుకోవడం విచారకరం" అని మలసాల భరత్ కుమార్ పేర్కొన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, జాజల రమేష్, తుమ్మపాల మాజీ సర్పంచ్ తట్టా పెంటయ్య నాయుడు, జెడ్పీటీసీ రుద్రరాజు, ఎంపీపీ గొర్లి సూరిబాబు తదితర ముఖ్య నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
శ్రీనివాస రావు. ఎ
జిల్లా ఇన్చార్జి
క్రైమ్ ఎనాలిసిస్
అనకాపల్లి .