అనకాపల్లి, ఫిబ్రవరి 18: జిల్లాలోని ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికా రంగంలో వివిధ హోదాల్లో పని చేస్తున్న అర్హులైన జర్నలిస్టులు 351 మందికి తొలి విడతలో అక్రిడిటేషన్లు మంజూరు చేస్తూ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఆమోదం తెలిపింది. కమిటీ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఉదయం కమిటీ సమావేశం జరిగింది. కన్వీనర్ & డిఐపిఆర్ఒ తో పాటు కమిటీ సభ్యులైన మీడియా ప్రతినిధులు, అధికారులు, కె. చంద్రరావు, బి. కొండలరావు, వై. నాగేశ్వరరావు, వై. సన్యాశినాయుడు, బి.గోపీనాధ్ రావు, ఎం. వెంకటరావు పట్నాయక్, ఎ. వెంకట అప్పారావు, పి. నాగశ్రీనివాసరావు, ఎస్. ప్రసాద్ బాబు, బి. ఈశ్వరరావు, పి. గిరిబాబు, ఆర్టీసీ డిపిటిఒ వి.ప్రవీణ, డీఎం&హెచ్వో ఎం.హైమావతి, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ పి.సుజాత పాల్గొన్నారు. జీవో.ఎం.ఎస్. నెం. 84, అందులో పేర్కొన్న నిబంధనలు, జర్నలిస్టుల అర్హతలు తదితర అంశాలపై చర్చించారు. ముందుగా కన్వీనర్ & డిఐపిఆర్ఒ ఎస్.వి. రమణ అజెండా అంశాలను కమిటీకి వివరించారు. దరఖాస్తుల పరిశీలన, ఆమోద ప్రక్రియ, ఇతర అంశాలను తెలిపారు. తొలి విడతలో భాగంగా ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు 402 దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా అందాయని చెప్పారు. ఇదిలా ఉండగా గురువారం జరిగిన సమావేశంలో 389 ప్రతిపాదించగా 351కి కమిటీ ఆమోదం లభించింది. ప్రింట్ మీడియా నుంచి 236, ఎలక్ట్రానిక్ మీడియా నుంచి 115 దరఖాస్తులు అర్హత పొందాయి. వివిధ కారణాల వల్ల 38 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. ఈ సందర్భంగా జిల్లా కమిటీ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులందరికీ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఉద్యోగులు, లాయర్ లు,టీచర్లు గా పనిచేసే వారు ఉన్నట్లయితే వారి సమాచారం తెలిపితే వారి అక్రెడిటేషన్ నిలుపుదల చేస్తామన్నారు. పోలీసు కేసులు నమోదై ఉన్న జర్నలిస్టుల విషయంలో నిబంధనల ప్రకారం వ్యవహరించాలని సూచించారు. సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ కు కమిటీ సభ్యులు జ్ఞాపికను అందజేసి సత్కరించారు.