అనకాపల్లి టౌన్, ఫిబ్రవరి 13, 2026: అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బైక్ దొంగతనం కేసులో నిందితుడికి కోర్టు ఐదు నెలల కఠిన కారాగార శిక్ష విధించినట్లు టౌన్ ఎస్.హెచ్.ఓ జి.ప్రేమ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కేసు నేపథ్యం: పూడిమడక జంక్షన్ బ్రిడ్జి కింద పార్క్ చేసిన AP31EP 5252 నంబర్ గల పల్సర్ బైక్‌ను దొంగిలించిన ఘటనపై అనకాపల్లి టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితుడైన మరిపి గోవిందరావు ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన అనకాపల్లి XIth AMM మెజిస్ట్రేట్ శ్రీ ఎ.రమేష్ , నేరం రుజువు కావడంతో ముద్దాయికి 5 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసులో ప్రభుత్వ తరపున APP మృణాళిని బలమైన వాదనలు వినిపించి, నిందితుడికి శిక్ష పడేలా చేశారు. నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు తమ వాహనాల భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ఎస్.హెచ్.ఓ జి.ప్రేమ్ కుమార్ గారు సూచించారు.