విద్యా దీప్తి-సంస్కార స్ఫూర్తి కార్యక్రమం.. పాల్గొన్న గాయత్రి వేద పాఠశాల విద్యార్థులు యలమంచిలి ప్రతి విద్యార్థి విద్యతో పాటు సంస్కారాన్ని అలవర్చుకున్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని, సనాతన ధర్మ ప్రచారం దేశానికి వెన్నెముక వంటిదని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని అడ్డరోడ్డు గ్రామంలో ఘనంగా నిర్వహించిన "విద్యా దీప్తి - సంస్కార స్ఫూర్తి" కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి యలమంచిలి గాయత్రి వేద పాఠశాల విద్యార్థులు పసుపు వర్ణ వస్త్రాలు ధరించి, సంప్రదాయబద్ధంగా హాజరయ్యారు. వేద విద్యార్థుల మంత్రోచ్ఛారణలతో అడ్డరోడ్డు పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. వేద పాఠశాల కార్యదర్శి పెద్దింటి సూర్యనారాయణ మూర్తి, అధ్యాపకులు కులకర్ణి, సాయి, సభ్యులు శిష్ట్లా వెంకటేష్, భాగవతుల సాయి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగాన్ని ఆలకించారు. ఈ సందర్భంగా చాగంటి వారు మాట్లాడుతూ పుస్తకాల్లో ఉండే జ్ఞానం కేవలం పరీక్షలు పాస్ కావడానికి మాత్రమే కాదు, జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడాలి అన్నారు. సంస్కారం లేని విద్య వెలుగు లేని దీపం వంటిదని, విద్యార్థులు చిన్నతనం నుంచే మన సంస్కృతిని, వేద విజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. వేదికపై బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత శాలువా తో కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వేద పండితులు చాగంటి వారికి ఆశీర్వచనాలు అందజేశారు. హోం మంత్రి అనిత మాట్లాడుతూ చాగంటి వారి అమృత వాక్కులను పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు నేరుగా వినే అవకాశం కలగడం మనందరి అదృష్టం. ముఖ్యంగా విద్యార్థులకు ఆయన సందేశం ఒక గొప్ప స్ఫూర్తినిచ్చింది" అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆధ్యాత్మిక వేత్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.