రాబోయే స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని యలమంచిలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ తనకాల అనంతరావు పిలుపునిచ్చారు. యలమంచిలి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని అనంతరావు విమర్శించారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, గ్రామాల్లో మంచినీటి ఎద్దడి, అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గ్రామాల్లో బెల్ట్‌షాపులు పెరగడంతో పాటు గంజాయి బ్యాచ్‌ల కార్యకలాపాలు ఆందోళనకరంగా మారాయని ఆరోపించారు.
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ, ఈ అంశాలను ప్రజా వేదికపై నిలదీయాలంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.
17న యలమంచిలిలో కాంగ్రెస్ సమావేశం
స్థానిక ఎన్నికలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణతో పాటు పలు అంశాలపై చర్చించేందుకు ఈ నెల 17వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు యలమంచిలిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు అనంతరావు తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొడ్డూ శ్రీనివాస్తో పాటు పలువురు జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు హాజరుకానున్నారని చెప్పారు.
యలమంచిలి టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డి రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షులు రావి రామసత్యం, యలమంచిలి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగు మంత్రి సాయి, డీసీసీ కార్యదర్శి సుందరపు ఈశ్వరరావు, జిల్లా మత్స్యకార సెల్ అధ్యక్షులు మేరుగు అచ్చిబాబు, జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి కంకణాలు నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.