రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి..
03/October/2026 20:16
Share:
అనకాపల్లి:
రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అనకాపల్లి ట్రాఫిక్ పోలీసులు సూచించారు. “సేఫ్ రోడ్స్ – సేఫ్ అనకాపల్లి” కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి పట్టణంలోని AMAL కళాశాల వద్ద ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై విద్యార్థులు, వాహనదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్, అనకాపల్లి ఎస్డీపీఓ శ్రీ శ్రీనివాసులు ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం. వెంకట నారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించడం, కారులో సీట్‌బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవడం, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఉల్లంఘించకపోవడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించకపోవడం, ట్రిపుల్ రైడింగ్‌కు దూరంగా ఉండటం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.రోడ్డు ప్రమాదాలు కేవలం ఒక్కరి జీవితాన్నే కాకుండా మొత్తం కుటుంబాన్ని ప్రభావితం చేస్తాయని పోలీసులు తెలిపారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ, ఇతరుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకుని వాహనాలు నడపాలని సూచించారు. “ప్రతి ప్రయాణం సురక్షితంగా సాగాలి – ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి” అనే సందేశంతో ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం తీసుకురావడమే కార్యక్రమం లక్ష్యమని పోలీసులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, విద్యార్థులు, వాహనదారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
క్రైమ్ ఎనాలసిస్ అనకాపల్లి జిల్లా ఇంచార్జ్ శ్రీనివాసరావు అప్పికొండ