అనకాపల్లి ​వరుస దొంగతనం కేసుల్లో నిందితుడికి 18 నెలల జైలు శిక్ష:

అనకాపల్లి ​వరుస దొంగతనం కేసుల్లో నిందితుడికి 18 నెలల జైలు శిక్ష:

04/February/2026 21:22    Share:   

అనకాపల్లి ​వరుస దొంగతనం కేసుల్లో నిందితుడికి 18 నెలల జైలు శిక్ష: దర్యాప్తు బృందాన్ని మరియు ఏపీపీని అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్. 

(సీనియర్ జర్నలిస్ట్ గంటా గోవింద్ )

అనకాపల్లి, ఫిబ్రవరి 04: అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వరుస రాత్రి దొంగతనాల (Night Burglaries) కేసుల్లో నేరం రుజువు కావడంతో, నిందితుడికి గౌరవ న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. శాస్త్రీయ ఆధారాలతో దర్యాప్తు జరిపి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన దర్యాప్తు అధికారులను మరియు ప్రాసిక్యూషన్ బృందాన్ని జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు.
కేసుల వివరాలు: 
​2019 సంవత్సరంలో అనకాపల్లి రూరల్ పరిధిలోని కొండ కొప్పాక, ఎల్.ఆర్.ఎం కాలనీ, సిరసపల్లి మరియు మారేడుపూడి వంటి ప్రాంతాలలో వరుస దొంగతనాలు జరిగాయి.
​ ఘటన 1: తాళం వేసి ఉన్న ఇళ్లలోకి చొరబడి భారీగా నగదు, బంగారు ఆభరణాల అపహరణ (Cr. Nos: 254, 279, 321/2019).
​ ఘటన 2: ఉక్కినగరంలో బాధితుడు శుభకార్యానికి వెళ్ళిన సమయంలో 13.5 తులాల బంగారం చోరీ.
​ ఘటన 3: ఎల్.ఆర్.ఎం కాలనీలో కిటికీ గ్రిల్స్ విరగ్గొట్టి 3 తులాల బంగారం అపహరణ (Cr.No. 288/2019).
న్యాయస్థాన తీర్పు: 
​ఈ కేసులపై విచారణ జరిపిన అనకాపల్లి XI అదనపు జుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ గౌరవనీయ న్యాయమూర్తి శ్రీ ఏ.రమేష్ గారు బుధవారం తుది తీర్పు వెల్లడించారు. ప్రధాన నిందితుడు (A-1) తాటిపూడి శంకర్ (ఆటో డ్రైవర్, అగనంపూడి) పాత నేరస్తుడు (Habitual Offender) కావడంతో, అతనిపై మోపబడిన అభియోగాలు రుజువైనట్లు నిర్ధారించి, ఒక సంవత్సరం ఆరు నెలల (18 నెలలు) సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.
​(గమనిక: ఈ కేసులలో మరో నిందితుడు ఏ-2 విచారణలో ఉండగానే మరణించగా, తగిన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఏ-3ని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది.)

​నిందితులను చాకచక్యంగా పట్టుకుని, చోరీ సొత్తును రికవరీ చేసిన అప్పటి దర్యాప్తు అధికారులు పి.వి.వి.నరసింహారావు, పి.రామకృష్ణారావు, ఏ.వెంకటేశ్వరరావు లను ఎస్పీ గారు కొనియాడారు. ముఖ్యంగా కోర్టులో సాక్ష్యాధారాలను సమర్థవంతంగా ప్రవేశపెట్టి, నిందితుడికి శిక్ష పడేలా వాదించిన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) శ్రీమతి మృణాళిని గారిని ప్రత్యేకంగా అభినందించారు.
​నేరస్తులకు శిక్ష పడటం ద్వారా బాధితులకు న్యాయం జరుగుతుందని, ఇది నేరాల నియంత్రణలో మరియు పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఎస్పీ గారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ ప్రక్రియలో సహకరించిన అనకాపల్లి రూరల్ పోలీసులు మరియు ఇతర సిబ్బందిని కూడా ఆయన అభినందించారు. (సీనియర్ జర్నలిస్ట్ గంటా గోవింద్ )
జిల్లా పోలీస్ కార్యాలయం, అనకాపల్లి.


Breaking News

Subscribe our Newsletter