నాటు తుపాకీ మిస్ ఫైర్ కావడంతో  బాలుడు మృతి

నాటు తుపాకీ మిస్ ఫైర్ కావడంతో  బాలుడు మృతి

10/March/2026 21:59    Share:   

- ఇద్దరు నిందితుల అరెస్ట్
యలమంచిలి : మండలంలోని ఏటికొప్పాక గ్రామ శివారులో జరిగిన నాటు తుపాకీ ప్రమాదంపై ఇన్చార్జ్ డిఎస్పి మోహన్ రావు ఆధ్వర్యంలో పోలీసులు సమగ్ర విచారణ జరిపి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం ఈ నెల 8వ తేదీ ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో ఏటికొప్పాకకు చెందిన ఆడారి వెంకట కౌశిక్ (12) మరియు మరికొందరు పిల్లలు ఆడుకోవడానికి వరాహ నది ఒడ్డున ఉన్న కసింకోట సూరిబాబు ఇంటి వద్దకు వెళ్లారు. అక్కడ సూరిబాబు కుమారుడు తన ఇంట్లో ఉన్న నాటు తుపాకులను చూపిస్తూ అవి ఎలా పనిచేస్తాయో వివరిస్తున్న క్రమంలో, ఒక తుపాకీ ప్రమాదవశాత్తు ఫైర్ అయ్యి పక్కనే ఉన్న వెంకట కౌశిక్‌కు తగిలింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, భయపడిన సూరిబాబు బాలుడి శవాన్ని సమీపంలోని తుప్పల్లో పడవేసి తన కుమారుడితో కలిసి పరారయ్యాడు. లైసెన్స్ లేకుండా అక్రమంగా నాటు తుపాకులు కలిగి ఉండి, వాటిలో మందుగుండు నింపి అత్యంత నిర్లక్ష్యంగా పిల్లలకు అందుబాటులో ఉంచడం వల్లే ఈ ఘోర కలి జరిగిందని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై ఇన్చార్జ్ డిఎస్పి మోహన్ రావు నేతృత్వంలో కేసు నమోదు చేసిన పోలీసులు, సోమవారం మల్లవరం వద్ద ప్రధాన నిందితుడు కసింకోట సూరిబాబుతో పాటు అతనికి గన్ పౌడర్ సరఫరా చేసిన ముత్యాల అప్పల రమణను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రెండు నాటు తుపాకులు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సెక్షన్ 106(1), 238 బిఎన్ఎస్ తో పాటు ఆర్మ్స్ యాక్ట్ మరియు ఎక్స్‌ప్లోజివ్స్ యాక్ట్ కింద కఠినమైన చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా చట్టవిరుద్ధంగా ఆయుధాలు కలిగివుంటే వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా డీఎస్పీ హెచ్చరించారు.
Breaking News

Subscribe our Newsletter