అనకాపల్లి జిల్లాలోని రైతులకు శుభవార్త: మార్చి 16 నుండి 'రైతన్న - మీకోసం వారోత్సవాలు'
అనకాపల్లి: రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'రైతన్న - మీకోసం వారోత్సవాలు'ప్రచార కార్యక్రమం అనకాపల్లి జిల్లాలో నిర్వహించబడుతుందని జిల్లా వ్యవసాయ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమం మొత్తం 6 రోజుల పాటు రెండు విడతలుగా (మార్చి16,17,18 మరియు మార్చి 23,24,25) జరగనుంది.
కార్యక్రమ ముఖ్యాంశాలు:
* నిర్వహణ: ప్రతి రైతు సేవా కేంద్రం (RSK) పరిధిలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులతో కూడిన బృందం ప్రతిరోజూ 30 క్లస్టర్లను (సుమారు 90 గృహాలను) సందర్శిస్తుంది.
* ప్రధాన సూత్రాలు: ఈ కార్యక్రమం ప్రధానంగా 5 అంశాలపై దృష్టి సారిస్తుంది:
* నీటి భద్రత
* డిమాండ్ ఆధారిత వ్యవసాయం
* వ్యవసాయ సాంకేతికత (Agri-tech)
* ఆహార శుద్ధి
* ప్రభుత్వ సహకారం
* అవగాహన: గౌరవ ముఖ్యమంత్రి వారి లేఖను రైతులకు అందజేయడంతో పాటు, APAIMS యాప్ వినియోగం,
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఈ బృందం అవగాహన కల్పిస్తుంది.
* సవాళ్లపై దృష్టి: ఎల్ నినో ప్రభావం, అంతర్జాతీయ పరిణామాలు (మధ్య ప్రాచ్యం) వల్ల కలిగే మార్పులు, పెరుగుతున్న ఇంధన ధరలు మరియు పంట దిగుబడిపై వాటి ప్రభావం వంటి అంశాలపై రైతులకు తగిన సలహాలు సూచనలు అందించడం జరుగుతుంది.
రైతులకు సూచనలు:
* రబీ 2025-26 పంట సర్వే పూర్తయినందున, రైతులు తమ భూమిలో సాగు చేసిన పంట వివరాలను సరిచూసుకోవాలి.
* రైతు e-KYC (బయో-మెట్రిక్/ఐరిస్/OTP ద్వారా) తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి.
* PM-KISAN వంటి ప్రభుత్వ ప్రయోజనాలు పొందడానికి రైతు ID తప్పనిసరి. జిల్లాలో సుమారు 20 లక్షల మంది రైతులకు ఇంకా రైతు ID లేనందున, ఈ వారోత్సవాల సందర్భంగా APFR కింద వారి పేర్లను నమోదు చేయడం జరుగుతుంది.
రైతు సోదరులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, అధికారుల బృందానికి సహకరించి తమ వివరాలను నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి కోరారు.