అధికారుల నిర్లక్ష్యంపై,భగ్గుమన్న తుమ్మపాల రెడీమిక్స్ ప్లాంట్ వివాదం !
06/May/2026 18:27
Share:
నిబంధనలు బేఖాతరు.. అధికారుల నిర్లక్ష్యంపై భగ్గుమన్న తుమ్మపాల రెడీమిక్స్ ప్లాంట్ వివాదం: ప్రజాభిప్రాయ సేకరణ రసాభాస మధ్యాహ్నం 1 గంట దాటినా హాజరుకాని అధికారులుగ్రామసభ ఆమోదం లేకుండానే గతంలో అనుమతులు ఎలా ఇచ్చారని నిలదీత అక్రమంగా పర్మిషన్లు ఇస్తే ఉద్యమం తీవ్రతరం చేస్తామని గ్రామస్తుల హెచ్చరిక అనకాపల్లి, (క్రైమ్ అనాలసిస్ ప్రతినిధి): అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామంలో వివాదాస్పద రెడీమిక్స్ కాంక్రీట్ ప్లాంట్ విస్తరణ కోసం ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ (పబ్లిక్ హియరింగ్) అధికారుల నిర్లక్ష్యంతో ఉద్రిక్తతలకు దారితీసింది. బుధవారం ఉదయం 11 గంటలకు జరగాల్సిన ఈ కార్యక్రమానికి మధ్యాహ్నం 1 గంట దాటినా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ), మైనింగ్, మరియు జిల్లా స్థాయి అధికారులు హాజరుకాకపోవడంతో తమ పనులు మానుకుని వచ్చిన గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై మండిపడ్డారు.ప్లాంట్ సామర్థ్యం పెంపు కోసం.తుమ్మపాల గ్రామ పరిధిలోని సర్వే నెం. 04లో 4.90 హెక్టార్ల స్థలంలో మెస్‌ర్స్ ఆర్‌ఎంసి (RMC) రెడీమిక్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రెడీమిక్స్ ప్లాంట్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఏటా 74,901 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 2,66,410 మెట్రిక్ టన్నుల గ్రావెల్ ఉత్పత్తి సామర్థ్యంతో కార్యకలాపాలు విస్తరించేందుకు ప్లాంట్ యాజమాన్యం దరఖాస్తు చేసుకుంది. ఈ ప్రాజెక్టుపై స్థానికుల అభ్యంతరాలు, సూచనలు స్వీకరించేందుకు మే 6వ తేదీన పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేశారు. అనుమతుల్లో గోల్‌మాల్? నిర్ణీత సమయానికి అధికారులు రాకపోవడంతో వేదిక వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పలువురు ప్రజా సంఘాల నాయకులు, గ్రామస్తులు మాట్లాడుతూ.. అసలు ఈ ప్లాంట్‌కు గ్రామసభ ఆమోదం లేకుండానే గతంలో అక్రమంగా అనుమతులు ఎలా సాధించారో అధికారులు ముందుగా సమాధానం చెప్పాలని నిలదీశారు. అప్పట్లో నిబంధనలు తుంగలో తొక్కి, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి అనుమతులు ఇచ్చిన అధికారులు, ఇప్పుడు మళ్లీ అదే సంస్థకు గడువు పొడిగింపు (ఎక్స్‌టెన్షన్) ఇవ్వడానికి ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు ఉద్దేశపూర్వకంగానే ప్రజా విచారణకు డుమ్మా కొట్టారని ఆరోపించారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం..ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా, పర్యావరణ నిబంధనలు గాలికొదిలేసి అక్రమంగా పరిశ్రమలకు అనుమతులు ఇస్తే చూస్తూ ఊరుకోబోమని గ్రామస్తులు హెచ్చరించారు. భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. అధికారుల రాకపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో పబ్లిక్ హియరింగ్ ప్రాంగణంలో గందరగోళం నెలకొంది. ఈ వ్యవహారం వెనుక జరిగిన అనుమతుల బాగోతంపై ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీనివాస్ ఏ క్రైమ్ ఎనాలిసిస్, జిల్లా ఇన్చార్జ్.అనకాపల్లి.