యం జగన్నాధపురం కలెక్టర్ దత్తత గ్రామంలోనే అక్రమ గ్రావెల్ దందా

యం జగన్నాధపురం కలెక్టర్ దత్తత గ్రామంలోనే అక్రమ గ్రావెల్ దందా

19/April/2026 13:56    Share:   

అచ్చుతాపురం మండలం, యం జగన్నాధపురం కలెక్టర్ దత్తత గ్రామంలోనే అక్రమ గ్రావెల్ దందా – పాలనా వ్యవస్థపై ప్రశ్నలు..!!
క్రైమ్ అనాలిసిస్, టివియస్ ప్రకాష్ :
జిల్లా కలెక్టర్ దత్తత తీసుకున్న గ్రామంలోనే అక్రమ గ్రావెల్ తవ్వకాలు బహిరంగంగా సాగుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఒక గ్రామాన్ని కలెక్టర్ దత్తత తీసుకున్నప్పుడు, ఆ గ్రామం జిల్లా మొత్తానికి ఆదర్శంగా నిలవాలి. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది.అర్ధరాత్రి జేసీబీలతో ప్రభుత్వ భూములు, కొండ పోరంబోకులను తవ్వుతూ గ్రావెల్ అక్రమంగా తరలిస్తున్న ఘటనలు వెలుగులోకి రావడం, అధికార యంత్రాంగం పనితీరుపై తీవ్ర అనుమానాలకు దారితీస్తోంది. గ్రామస్థుల ప్రకారం, ఈ తవ్వకాలు ఒక్కరోజు వ్యవహారం కాదు, నిరంతరంగా జరుగుతున్న అక్రమ కార్యకలాపాలు
ఈ ఘటనలో ముఖ్యంగా నిఘా వ్యవస్థ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామ స్థాయి అధికారులు అయిన వీఆర్‌ఓ, పంచాయతీ కార్యదర్శి, స్థానిక పోలీస్ సిబ్బంది ఈ అక్రమాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సమాచారం ఉన్నప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్నారా? లేక  అక్రమార్కులతో కుమ్మక్కయ్యారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక “దత్తత గ్రామం” అనే భావన కూడా ప్రశ్నార్థకంగా మారింది. అభివృద్ధి పనులకే పరిమితమై, అక్రమాలను అరికట్టడంలో విఫలమైతే దత్తత యొక్క అసలు ఉద్దేశ్యం ఏమిటన్న ప్రశ్న ప్రజలలో వినిపిస్తోంది.మరొక ఆందోళన కలిగించే అంశం రాజకీయ ప్రమేయం. స్థానికంగా రాజకీయ మద్దతు లేకుండా ఇంత పెద్ద స్థాయిలో అక్రమ తవ్వకాలు జరగవని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల అధికారులు కూడా ఒత్తిడికి లోనవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.దత్తత గ్రామంలోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇక మారుమూల గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ఉన్న అధికార యంత్రాంగం విఫలమైతే, ప్రజల నమ్మకం దెబ్బతినడం అనివార్యం.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై చర్యలు చేపట్టి వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Breaking News

Subscribe our Newsletter