ఎలమంచిలి: కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి మరియు సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఎలమంచిలి శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు స్పష్టం చేశారు. బుధవారం ఎలమంచిలిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వేదికగా నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలకు చెందిన వెలుగు సిబ్బందికి (VOA, CA) ప్రభుత్వం మంజూరు చేసిన సెల్ ఫోన్లను ఆయన పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో విధులు నిర్వహించే వెలుగు సిబ్బంది పనితీరును మరింత మెరుగుపరచడానికి, సాంకేతికతను జోడించి విధి నిర్వహణను సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించేలా కూటమి ప్రభుత్వం ప్రత్యేక అవకాశాలు కల్పిస్తోందని, ఈ ప్రోత్సాహాన్ని ఉపయోగించుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆయన కోరారు.ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేర్చే బాధ్యతను సిబ్బంది తీసుకోవాలని, ప్రభుత్వం చేపడుతున్న మంచి పనులను ప్రజలకు వివరించాలని సూచించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల డ్వాక్రా మహిళలు, వెలుగు విభాగం అధికారులు, సిబ్బంది మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.