యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల అవస్థలు..!చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్..!!
08/April/2026 19:44
Share:
క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్ యలమంచిలి : అనకాపల్లి జిల్లా యలమంచిలిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల లోపంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి చేరుకున్న రోగులకు సమయానికి చికిత్స అందకపోవడం ఆందోళన కలిగిస్తోంది.విధుల్లో ఉండాల్సిన వైద్యులు సమయానికి హాజరు కాకపోవడం వల్ల రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఆసుపత్రిలో ఉన్న కొద్దిమంది సిబ్బంది తమ వంతు కృషి చేస్తున్నప్పటికీ, సరిపడా సదుపాయాలు లేకపోవడం వల్ల పరిస్థితి మరింత విషమంగా మారుతోంది.అత్యవసర చికిత్స అవసరమైన రోగులను “పరికరాలు లేవు” అనే కారణంతో అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించడం జరుగుతోంది. దీంతో రోగుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశాలు పెరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం ఉండాల్సిన సమయంలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం విచారకరం.కాబట్టి సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తక్షణమే స్పందించి,వైద్యుల హాజరు కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవడం, అవసరమైన పరికరాలు సమకూర్చడం,సిబ్బంది సంఖ్య పెంచడం వంటి చర్యలు చేపట్టి రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.