ఏలూరు: పిల్లల ఆరోగ్యం విషయంలో ఏలూరు జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు. వీధుల్లో విక్రయించే నాసిరకం ఐస్‌క్రీమ్‌ల వల్ల చిన్నపిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని భావించిన గ్రామస్థులు, వాటి అమ్మకాలపై స్వచ్ఛందంగా నిషేధం విధిస్తున్నారు.
వరుస కడుతున్న గ్రామాలు:
మొదట కుక్కునూరు మండలం నెమలిపేట గ్రామంలో ప్రారంభమైన ఈ నిబంధన, ఇప్పుడు వేలేరుపాడు మండలం రామవరం గ్రామానికి కూడా పాకింది. గ్రామంలోకి ఐస్‌క్రీమ్ బండ్లు రాకూడదని, ఒకవేళ నిబంధనలు అతిక్రమించి వస్తే రూ. 5,000 జరిమానా విధిస్తామని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ఊరి వెలుపల భారీ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు.
ఆరోగ్యమే మహాభాగ్యం:
"తక్కువ ధరకే వస్తున్నాయని నాసిరకం ఐస్‌క్రీమ్‌లు తిని మా పిల్లలు ఆస్పత్రుల పాలవుతున్నారు. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాం" అని రామవరం గ్రామస్థులు స్పష్టం చేస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తు మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది