అనకాపల్లి/యలమంచిలి:
అనకాపల్లి జిల్లా యలమంచిలి బ్లాక్ పరిధిలోని అభ్యుదయ రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంతో చేపట్టిన క్షేత్రస్థాయి పర్యటన మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. జిల్లా వ్యవసాయ అధికారిణి ఎం. ఆశా దేవి జండా ఊపి 'రైతు రథాన్ని' ప్రారంభించి, రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. 'ఆత్మ' ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విజ్ఞాన యాత్రలో భాగంగా రైతులను పోలవరం జిల్లాలోని ఉద్యానవన వర్సిటీ మరియు కృషి విజ్ఞాన కేంద్రానికి తీసుకువెళ్లారు.
ఈ సందర్భంగా ఉద్యానవన వర్సిటీ శాస్త్రవేత్త ప్రవీణ్ రైతులతో ముచ్చటిస్తూ.. తాటి పండ్లు, నీరా ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం మామిడి, జీడి తోటల పెంపకంలో అధునాతన అంటుకట్టు విధానాలు, అధిక దిగుబడినిచ్చే రకాల గురించి రైతులకు క్షుణ్ణంగా వివరించారు.
ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో కమర్షియల్ పంటల ప్రాధాన్యతను వివరిస్తూ, ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగుపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. ఆయిల్ పామ్ తోటల్లో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు, ప్రస్తుత మార్కెట్లో పామాయిల్ ధరలు మరియు డిమాండ్ గురించి అవగాహన కల్పించారు. అనంతరం రైతులు ఆయిల్ పామ్ నర్సరీని సందర్శించి వివిధ రకాలను ఆసక్తిగా పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు మోహన్ రావు, సౌజన్య, శంకర్ గౌడ్, విస్తరణాధికారి దేవుడు, నారాయణరావుతో పాటు యలమంచిలి ప్రాంతానికి చెందిన పెద్ద సంఖ్యలో అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.