పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల అసహనం
30/March/2026 21:50
Share:
యలమంచిలి: మున్సిపాలిటీ పరిధిలోని ఓరుగంటి వారి వీధి లో గత రెండు రోజులుగా వీధి దీపాలు పట్టపగలే వెలుగుతూ దర్శనమిస్తున్నాయి. సూర్యుడు నడినెత్తికి వచ్చినా దీపాలు ఆర్పే నాథుడే కరువవ్వడంతో విద్యుత్ భారీగా వృథా అవుతోంది.
ప్రభుత్వం విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల విలువైన విద్యుత్ వృథా కావడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఉదయం వేళల్లో కూడా లైట్లు వెలుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం విచారకరమని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి, తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని మరియు విద్యుత్ దుబారాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.