యలమంచిలి, బుధవారం (క్రైమ్ అనాలిసిస్ - టివిఎస్ ప్రకాష్): యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌లో కేవలం ఐదు రూపాయలకే భోజనం అందించడం పేద ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా మారిందని స్థానికులు అభిప్రాయపడ్డారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గొర్లె నానాజీ అన్న క్యాంటీన్‌ను సందర్శించి అక్కడ భోజనం చేస్తున్న ప్రజలతో మాట్లాడారు. భోజన నాణ్యతపై అడగగా, ప్రజలు భోజనం రుచికరంగా ఉండటంతో పాటు తక్కువ ధరలో అందుబాటులో ఉండటం ఆనందకరమని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఐదు రూపాయలకే భోజనం అందించడం ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నారని ప్రజలు అభిప్రాయపడ్డారు. సుదూర ప్రాంతాల నుంచి వివిధ పనుల నిమిత్తం పట్టణానికి వచ్చే ప్రజలకు ఈ క్యాంటీన్ ఎంతో ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొర్లె బాబురావు, గుర్రాల రాము, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.